Sangameshwara Temple : సంగమేశ్వరాలయ దర్శనం.. కృష్ణమ్మ ఒడి నుంచి బయటకు..
Sangameshwara Temple : ఏడాదిలో దాదాపు 8 నెలలు కృష్ణ జల దివాసంలో ఉండే సంగమేశ్వర ఆలయం.. క్రమంగా బయటపడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో... ఆలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Sangameshwara Temple : ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని సప్తనది సంగమేశ్వర ఆలయం..... కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడుతోంది. కృష్ణా జల దివాసం నుంచి బయటపడి.. దర్శనమిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి సమీపంలో ఉన్న ఈ పురాతన ఆలయం... ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు నీటిలో జల దివాసంలోనే ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ కాలం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగే ఉంటుంది. ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగుల కన్నా దిగువకు తగ్గిన సందర్భంలో సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. ప్రస్తుతం... కృష్ణా నదిలో నీటి మట్టం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండటంతో.. సంగమేశ్వర ఆలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. అనేక మంది భక్తులు బోట్ల ద్వారా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాశివరాత్రి నాటికి ఆలయం జలదివాసం నుంచి పూర్తిగా బయటపడుతుందని... ఆలయంలోని లింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ పూజారులు చెబుతున్నారు.
ఏడు నదులు కలిసే ప్రదేశం కాబట్టి ఈ ఆలయానికి సప్తనది సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అని పిలుస్తారు. కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే నాగర్ కర్నూలు జిల్లా సోమశిల సోమేశ్వర స్వామి ఆలయానికి అతి కొద్ది దూరంలోనే సంగమేశ్వర ఆలయం ఉంది.
ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని శివాలయాల్లో ఉన్నట్లుగా కాకుండా... ఇక్కడ వృక్షశిలాజమే శివలింగంగా పూజింపబడుతోంది. ఈ లింగాన్ని పాండవులలో అగ్రజుడు ధర్మరాజు ప్రతిష్టించాడని చెప్పుకుంటారు. పాండవులు శ్రీశైలం మల్లికార్జున దేవాలయాన్ని సందర్శించినపుడు ఇక్కడ ఈ దేవాలయంలో శివలింగ ప్రతిష్ట చేసినట్లుగా స్కంధపురాణంలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. శివలింగ ప్రతిష్టకు కావలసిన లింగాన్ని వారణాసి నుండి తేవలసిన భీముడు ముహుర్త సమయానికి రాకపోవడంతో ధర్మరాజు వేపదుంగను లింగంగా ప్రతిష్టించాడని ప్రతీతి.
ఈ దేవాలయం 8వ శతాబ్దంలో నిర్మించబడి వుంటుందని భావిస్తున్నారు. నిర్మాణపరంగా రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలాలకు చెందినట్లు తెలుస్తున్నదని అంటారు చరిత్రకారులు. శ్రీశైలం జలాశయం నిండినప్పుడల్లా ఈ గుడి నీట మునిగిపోతూనే వుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేసినపుడు 1981లో మునిగిన ఈ దేవాలయం.... 2003లో బయటకు కనపడింది. ఆ తర్వాత నుంచి ప్రాజెక్టులో నీరు తగ్గిన ప్రతిసారి సంగమేశ్వరాలయం భక్తులకు దర్శనమిస్తోంది. ఏటా మహాశివరాత్రికి ఆలయంలోని వేపదారు లింగాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు.