Rebel Star Krishnam Raju : రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత-rebel star krishnam raju passed away on 11 september 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rebel Star Krishnam Raju : రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత

Rebel Star Krishnam Raju : రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత

HT Telugu Desk HT Telugu
Sep 11, 2022 08:48 AM IST

rebel star krishnam raju no more: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

<p>రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత</p>
రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత (twitter)

Rebel Star Krishnam Raju Passes Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940లో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు నటించిన రెండో చిత్రం భక్తకన్నప్ప.. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆయన కేరీర్‌లోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. భక్తకన్నప్పగా కృష్ణంరాజు నటన ప్రతి ఒక్కర్నీ మెప్పించింది. ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ...

rebel star krishnam raju political journy: బీజేపీ తరఫున 1998 లో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కృష్ణంరాజు. ఆ తరువాత నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగానూ పని చేశారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కొద్దిరోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉన్న ఆయన... తిరిగి భారతీయ జనతా పార్టీలోకి చేరారు.

రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ముఖ్యమంత్రుల సంతాపం..

కృష్ణం రాజు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, వెండితెరకు తీరని లోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

సినిమా రంగానికి, ప్రజా సంక్షేమానికి రెబల్ స్టార్ చేసిన కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Whats_app_banner