Pawan Kalyan : నేరగాళ్లు రాజకీయాలు చేస్తే వ్యవస్థ నాశనం, పులివెందుల సంస్కృతిని అన్ని చోట్ల తీసుకొచ్చారు - పవన్ కల్యాణ్
Pawan Kalyan : రాష్ట్రంలో అన్ని చోట్లకు పులివెందుల సంస్కృతిని విస్తరించాలని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని పవన్ అన్నారు.
Pawan Kalyan : వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతలతో పవన్ సమావేశం అయ్యారు. వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు ద్వీపం ఇవాళ కడప రాజంపేట వరకూ వెలుగుతోందని అన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి మన దేశంలో శిక్ష పడుతోందన్నారు కానీ రూ.5 వేల కోట్లు తినేసిన రాజకీయ నేత రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శలు చేశారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని పవన్ వ్యాఖ్యానించారు. జనసేనలో విభిన్న కులాలు, మతాల నుంచి నేతలు ఉన్నారన్నారు. జనసేన ఓడిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమన్నారు.
ఓట్లు తీసేస్తారు..జాగ్రత్త
కుల సర్దుబాటు కోసమే తాను కులప్రస్తావన తీసుకొస్తున్నట్లు పవన్ అన్నారు. రాజోలులో విజయం జనసేనకు ఊపిరి పోసిందన్నారు. రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో మన ఓట్లు తీసేస్తున్నారని, దొంగ ఓట్లు వేస్తారని అందరు జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. మన ఓటుతో గెలిచి నేతలు జవాబుదారీతనం లేకపోతే కుదరదన్నారు. పార్టీ నుంచి జంప్ అయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలని, రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలని పవన్ అన్నారు. ఏపీని వైసీపీ నుంచి విముక్తి కలిగించాలన్న పవన్.... అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలన్నారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదని పవన్ సూచించారు. జనసేన ఓట్లతో అసెంబ్లీకి వెళ్లి, పార్టీ మారిన రాపాక లాంటి వారిని రీకాల్ చేయాలని చెప్పారు.
కార్యకర్తల కోసం ప్రాణాలైనా ఇస్తా
అర్థనారీశ్వరి తత్వం అని మహిళల్ని గౌరవిస్తాం కానీ.. రాజకీయాల్లో వాళ్లకు మూడోవంతు కూడా ఇవ్వలేకపోతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో ఆడపడుచులు మూడోవంతు ఉండాలని జనసేనాని ఆకాంక్షించారు. మహిళల రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని పవన్ హామీ ఇచ్చారు. పార్టీలో వర్గాలు ఉండటంలో తప్పు లేదన్న పవన్... ఆ వర్గాలు పార్టీకి విజయం చేకూర్చేలా ఉండాలి తప్ప, దిగజార్చే విధంగా ఉండకూడదని సూచించారు. రాజోలు విజయం తనకు ప్రేరణ ఇచ్చిందని పవన్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్రీకృతం చేయడానికి రాజోలు విజయం కారణమన్నారు. కార్యకర్తల కోసం తాను గొడవలు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. జనసేన కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాల్ని కూడా అడ్డుపెడతానని పవన్ కల్యాణ్ తెలిపారు.