Visakhapatnam : విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌.. శిశువు చ‌నిపోయిన‌ట్లు వైద్యుల నిర్ధార‌ణ‌.. కాసేపటికే క‌ద‌లిక‌!-rare incident at visakhapatnam kgh hospital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakhapatnam : విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌.. శిశువు చ‌నిపోయిన‌ట్లు వైద్యుల నిర్ధార‌ణ‌.. కాసేపటికే క‌ద‌లిక‌!

Visakhapatnam : విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌.. శిశువు చ‌నిపోయిన‌ట్లు వైద్యుల నిర్ధార‌ణ‌.. కాసేపటికే క‌ద‌లిక‌!

HT Telugu Desk HT Telugu
Nov 10, 2024 09:25 AM IST

Visakhapatnam : విశాఖ‌ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న జరిగింది. శిశువు పుట్టి 7 గంట‌లు అయినా ఊపిరి ఆడ‌లేదు. దీంతో విధుల్లో ఉన్న డాక్ట‌ర్లు పరిశీలించి, ప్రాణం పోయింద‌ని నిర్ధారించారు. ల‌బోదిబోమంటూ మృతి చెందిన శిశువును త‌ర‌లించేందుకు కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు. ఇదే స‌మయంలో శిశువ‌లో క‌ద‌లిక‌లు వ‌చ్చాయి.

విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌
విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘ‌ట‌న‌

విశాఖ‌ప‌ట్నంలోని ఒక వీధికి చెందిన గ‌ర్భిణీ పురిటి నొప్పుల‌తో శుక్ర‌వారం రాత్రి 9 గంట‌లకు కేజీహెచ్ గైనకాల‌జీ వార్డులో చేరారు. వైద్యులు సిజేరియ‌న్ చేసి ప్ర‌స‌వం చేశారు. మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మించిన‌ప్పటికీ బ‌రువు త‌క్కువ‌గా ఉంది. దీంతో అవ‌స‌ర‌మైన వైద్య సేవ‌లు అందించారు. శ‌నివారం తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల స‌మ‌యంలో శిశువుకు ఊపిరి ఆడ‌లేదు. విధుల్లో ఉన్న వైద్యులు శిశువును ప‌రిశీలించి, ప్రాణం పోయింద‌ని చెప్పారు.

ఆసుప‌త్రి రికార్డులో కూడా శిశువు మృతి చెందిన‌ట్లు న‌మోదు చేశారు. కుటుంబ స‌భ్య‌ులు క‌న్నీరు మున్నీరు అవుతూ.. శిశువును ఇంటికి త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ స‌మయంలో అంబులెన్స్‌లో ఉంచిన శిశువులో క‌ద‌లిక‌లు రావ‌డాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. వెంటనే వైద్యుల‌కు స‌మాచారం అందించారు.

స్పందించిన వైద్యులు వెంట‌నే శిశువును పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శిశువు త‌ల్లిండ్రులు, కుటుంబ స‌భ్యులకు త‌మ శిశువు బ‌తుకుతుంద‌ని ఆశ చిగురించింది. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు వివరించారు. శిశువుకు ఇంకా చికిత్స కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

త‌మ బిడ్డ విష‌యంలో వైద్యులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేజీహెచ్ సూప‌రింటెండెంట్‌ డాక్ట‌ర్ పి.శివానంద వివ‌ర‌ణ ఇస్తూ.. ఇలాంటి కేసులు అరుద‌ని, శిశువును గైన‌కాల‌జిస్టులు, చిన్న పిల్ల‌ల డాక్ట‌ర్లు క‌లిసి చూస్తున్నారని వివరించారు. త‌క్కువ బ‌రువుతో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగ‌బెట్టి ఉండిపోతార‌ని, దీన్ని ఎపెనిక్ స్పెల్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని అన్నారు.

ఈ కేసు విష‌యంలో అదే జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం శిశువుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని సూప‌రింటెండెంట్‌ డాక్ట‌ర్ పి.శివానంద వెల్లడించారు. ప్ర‌స్తుతం త‌ల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నార‌ని, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణకు ఆదేశించిన‌ట్లు స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner