KA Paul : కేఏ పాల్ దీక్ష భగ్నం కేజీహెచ్ కు తరలింపు- పోలీసుల కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారీ-visakhapatnam praja shanti party chief ka paul arrested shift to kgh in steel plant pretest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ka Paul : కేఏ పాల్ దీక్ష భగ్నం కేజీహెచ్ కు తరలింపు- పోలీసుల కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారీ

KA Paul : కేఏ పాల్ దీక్ష భగ్నం కేజీహెచ్ కు తరలింపు- పోలీసుల కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారీ

Bandaru Satyaprasad HT Telugu
Aug 29, 2023 08:22 PM IST

KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసుల భగ్నం చేశారు. కేఏ పాల్ ను అరెస్ట్ చేసి కేజీహెచ్ కు తరలించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్నారు.

కేఏ పాల్
కేఏ పాల్

KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేఏ పాల్ ను అరెస్ట్ చేసి కేజీహెచ్ కు తరలించారు. ఈ సమయంలో కేఏ పాల్ కాసేపు హల్ చల్ చేశారు. సీఐ కాలర్ పట్టుకుని ఓవరాక్షన్ చేశారు. కేఏ పాల్ కు పోలీసులు సర్దిచెప్పినా ఆయన వినలేదు. దీంతో కేఏ పాల్‌కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని వైద్యం అవసరంలేదని కేఏ పాల్ పోలీసులపై చిందులు వేశారు. కేజీహెచ్ కు తరలించిన అనంతరం కేఏ పాల్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకొని తన వాహనంలో మళ్లీ దీక్షా శిబిరానికి చేరుకున్నారు.

దీక్ష కొనసాగించాలని నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ రెండో రోజు దీక్ష కొనసాగించారు. అయితే దీక్షా శిబిరం నుంచి ఆయనను పోలీసులు బలవంతంగా కేజీహెచ్ కు తరలించారు. అయితే కేజీహెచ్ గేటు వద్ద కేఏ పాల్ పోలీసులతో గొడవ పడ్డారు. తాను ఆరోగ్యంగా ఉన్నా తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. తనను చంపేందుకే ఇలా చేస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ...తాను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో సత్వర న్యాయం కావాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్‌ తేల్చి చెప్పారు.

నాకేమైనా అయితే సీఎందే బాధ్యత

" నా ప్రాణానికి ఏదైనా అయితే ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత. పోలీసులు నాపై అనుచితంగా ప్రవర్తించారు. నా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. నా బట్టలు చింపేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలేదు అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు. ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏంచేశారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయొద్దని నేను కోరాను. ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి ఈ ప్రైవేటీకరణ వద్దని కోరారు. నిన్న కూడా కేంద్ర మంత్రుల నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం. ప్రధాని మోదీ నుంచి హామీ వచ్చే వరకు దీక్ష విరమించను" - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

Whats_app_banner