AP Liquor Brands : మందుబాబులకు ఏపీ సర్కార్ కూల్ న్యూస్, పాత బ్రాండ్ల మద్యంపై కీలక ప్రకటన-rajahmundry minister kollu ravindra says new liquor policy commence on october 1st old brands liquor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Brands : మందుబాబులకు ఏపీ సర్కార్ కూల్ న్యూస్, పాత బ్రాండ్ల మద్యంపై కీలక ప్రకటన

AP Liquor Brands : మందుబాబులకు ఏపీ సర్కార్ కూల్ న్యూస్, పాత బ్రాండ్ల మద్యంపై కీలక ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Aug 10, 2024 05:13 PM IST

AP Liquor Brands : మందుబాబులకు ఏపీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామని, తిరిగి పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందిస్తామన్నారు.

మందుబాబులకు ఏపీ సర్కార్ కూల్ న్యూస్, పాత బ్రాండ్ల మద్యంపై కీలక ప్రకటన
మందుబాబులకు ఏపీ సర్కార్ కూల్ న్యూస్, పాత బ్రాండ్ల మద్యంపై కీలక ప్రకటన

AP Liquor Brands : ఏపీలో మందుబాబులు ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న పాత బ్రాండ్లు మరికొన్ని రోజుల్లో వారి ముందుకు రానున్నాయి. కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లపై మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలుచేస్తామని మంత్రి తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆరు రాష్ట్రాల మద్యం పాలసీలపై అధికారుల బృందం అధ్యయనం చేస్తు్ందన్నారు. వైసీపీ హయాంలో నాసిరకం లిక్కర్ అధిక ధరలకు విక్రయించారని ఆరోపించారు. మద్యం పాలసీతో అక్రమాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన లిక్కర్ అందిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.45 వేల కోట్ల అక్రమాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ఇసుక సరఫరాపై

ఇసుక తవ్వకాలపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర... వరదల కారణంగా అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. అక్టోబర్ 17 నుంచి రాజమండ్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి మూడు కోట్ల టన్నుల ఇసుక అవసరం ఉందన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. రవాణా ఖర్చులు తప్ప, ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 స్టాక్ పాయింట్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో లోటుపాట్లను సరిదిద్దుతామన్నారు.

పూర్తి స్థాయిలో పాపులర్ మద్యం బ్రాండ్లు

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన మద్యం పాలసీ, పాత బ్రాండ్ల మద్యంపై చర్చ జరిగింది. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామని, పాత బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ముందుగా కొత్త లిక్కర్ పాలసీ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిలో భాగంగా ఓ కమిటీని వివిధ రాష్ట్రాల మద్యం విధానాలపై అధ్యయనం చేసేందుకు నియమించింది. ఈ కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పాపులర్‌ మద్యం బ్రాండ్లను పూర్తిస్థాయిలో తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలు ఎక్కువగా తాగే మద్యం ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం, దీంతో పాటు మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

ప్రీమియం బ్రాండ్ల మద్యం కంపెనీలను తిరిగి ఏపీకి ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం విక్రయాల్లో ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవని, పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చని ఆ కంపెనీలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. గత ప్రభుత్వం మద్య నిషేధం పేరుతో మద్యం ధరలు భారీగా పెంచింది. దీంతో ప్రీమియం బ్రాండ్లు ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని వీడాయి. మద్యం ధరలు పెంపు, పాత బ్రాండ్లు దొరక్కపోవడంతో గత ప్రభుత్వంపై మందుబాబులు ఎన్నికల్లో తమ ప్రభావం చూపారు. దీంతో ఈ విషయంపై సీరియస్ గా ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కాస్త తగ్గినా మద్యం ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. మద్యం ప్రియులు తమకు నచ్చిన మద్యాన్ని కొనుగోలు చేసే విధంగా పాపులర్ ప్రైవేట్ బ్రాండ్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయని తెలుస్తోంది.

సంబంధిత కథనం