AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా?-amaravati ap liquor scam fake hologram sticker to liquor sales found in vigilance invention ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా?

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా?

Bandaru Satyaprasad HT Telugu
Jul 30, 2024 05:07 PM IST

AP Liquor Scam : ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాలతో పాటు హోలో గ్రామ్ స్టిక్కర్లలో భారీ స్కామ్ జరిగిందన్న అభియోగాలు వినిపిస్తున్నాయి.

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లు మద్యం సరఫరా?
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లు మద్యం సరఫరా?

AP Liquor Scam : వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యం విక్రయాల్లో రూ.18 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని స్వయంగా సీఎం తెలిపారు. మద్యం విక్రయాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. మద్యం డిపోల నుంచి కాకుండా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచే షాపులకు మద్యం బాటిళ్లను తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 13.68 కోట్ల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్లకు సంబంధించి టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం పంపిణీ చేశారని, ఇందుకోసం టెండర్లను పక్కదారి పట్టించారని ఆరోపిస్తు్న్నారు. మద్యం హోలో గ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు.

హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కామ్

హోలో గ్రామ్ స్టిక్కర్ల పేరిట భారీ స్కామ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో భయటపడిందని వార్తలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్ల హోలో గ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్టు విచారణలో తెలిందట. అనుభవం లేని కంపెనీలకు హోలో గ్రామ్ టెండర్లను బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కట్టబెట్టినట్టు విచారణలో తెలిసినట్లు సమాచారం.

ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం

వైసీపీ ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ మద్యం విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం పేరుతో ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి జగన్ జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. పిచ్చి బ్రాండ్లు తెచ్చి పేదల ఆరోగ్యాలతో ఆడుకున్నారన్నారు. మద్యం అమ్మకాల్లో క్యాష్ మాత్రమే అంగీకరించేవారని, ఆన్ లైన్ విధానం పెట్టకుండా దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో మద్యం ధరలను 75 శాతం పెంచారని సీఎం చంద్రబాబు అన్నారు.

నాసిరకం మద్యం

ఏపీలో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా దుకాణాలకు చేరిపోయే మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసింది. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి విక్రయాలు జరిపారు. 2019మే నాటి ఉన్న ధరలతో పోలిస్తే 2024నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం