HT Telugu Effect: ఏపీలో ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్, కీలక సంస్కరణలకు సర్కారు శ్రీకారం..-sand booking is now in the secretariats in ap the government has initiated key reforms ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ht Telugu Effect: ఏపీలో ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్, కీలక సంస్కరణలకు సర్కారు శ్రీకారం..

HT Telugu Effect: ఏపీలో ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్, కీలక సంస్కరణలకు సర్కారు శ్రీకారం..

Sarath chandra.B HT Telugu
Aug 06, 2024 12:51 PM IST

HT Telugu Effect: ఉచిత ఇసుక పథకంలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఉచిత ఇసుకను సచివాలయాల్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌టి తెలుగు చేసిన సూచనల్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.

హెచ్‌టి తెలుగు ఎఫెక్ట్‌... ఇక సచివాలయాల్లోనే ఉచిత ఇసుక బుకింగ్
హెచ్‌టి తెలుగు ఎఫెక్ట్‌... ఇక సచివాలయాల్లోనే ఉచిత ఇసుక బుకింగ్

HT Telugu Effect: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక పథకం అమలులో కీలక సంస్కరణకు చేపట్టింది. హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు ప్రహసనంగా ఉచిత ఇసుక పథకంపై ప్రచురించిన కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ఉచిత ఇసుక పథకం అమలులో హెచ్‌టి తెలుగు సూచించిన పరిష్కారాలను అమలు చేసేందుకు గనుల శాఖ మొగ్గు చూపింది. ఇసుక రీచ్‌లలో సామాన్యులకు ఇసుక కొనే పరిస్థితులు లేకపోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని సవివరంగా వివరిస్తూ వెలువరించిన కథనాలకు సిఎంఓ స్పందించింది.

ఏపీలో నిర్మాణరంగానికి గుదిబండగా మారిన ఇసుక లభ్యతలో కీలక మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. మొదట వచ్చిన మొదట ప్రాతిపదికన సీనరేజీ చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లడానికి అనుమతించింది.

అయితే Free Sand విధానంలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ప్రజలకు సొంతంగా ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలించే అవకాశం లేకపోవడంతో దళారుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక రీచ్‌లను స్థానిక నాయకులు గుప్పెట్లో పెట్టుకుని కావాల్సిన వారికి మాత్రమే లోడింగ్ చేస్తున్నారు. వెరసి ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాకపోగా.. చెడ్డ పేరు మాత్రం తప్పడం లేదు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకున్నా దళారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఈ అంశాలను పలుమార్లు హెచ్‌ టి తెలుగు కథనాలు ఇచ్చింది.

సోమవారం ఏపీ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మైనింగ్ శాఖపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. స‌చివాల‌యాల్లో ఇసుక బుకింగ్ స‌దుపాయం కల్పించాలని, వినియోగ‌దారుడు అక్క‌డే డ‌బ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణా ఛార్జీలు కూడా స‌చివాల‌యాల్లోనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇందుకు జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇసుక సామాన్యుడి హ‌క్కు అని, గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఇకపై సచివాలయంలోనే చెల్లింపులు…

ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. స‌చివాలయంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో గ‌నుల శాఖ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై మాట్లాడుతూ ఈ విష‌యం చెప్పారు.

ఇసుక ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌హ‌జ వ‌న‌రు అని, అది సామాన్యుడి హ‌క్కు అని, దాన్ని ఎవ‌రికి వారు ఇష్టానుసారం దోచుకోవ‌డాన్ని త‌మ ప్ర‌భుత్వం స‌హించ‌ద‌న్నారు. సామాన్యులంద‌రికీ ఇసుక ఉచితంగా ల‌భించేలా పూర్తీ పార‌ద‌ర్శ‌క‌త పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

ఇసుక కావాల్సిన వినియోగ‌దారులు ఇక‌పైన త‌న‌కు ఎంత ఇసుక కావాలో త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలోనే బుకింగ్ చేసుకునే విధానం తీసుకొస్తున్నామ‌ని, ఇసుక రీచ్ నుంచి త‌న ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణ ఛార్జీలు కూడా స‌చివాల‌యంలోనే చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

రీచ్ నుంచి ట్ర‌క్కులో ఇసుక వినియోగ‌దారుడి ఇంటికి చేరిన త‌రువాత‌, వినియోగ‌ దారుడు త‌న‌కు ఇసుక చేరింద‌ని చెప్పిన త‌రువాతే ఆ ర‌వాణ ఖ‌ర్చులు ఆ ట్ర‌క్కు య‌జ‌మానికి రిలీజ్ చేసేలా ప‌ద్ద‌తి తీసుకొస్తామ‌న్నారు. ఇసుక తీసుకెళ్ల‌డానికి ఉప‌యోగించే ట్ర‌క్కుల‌న్ని కూడా ప్రీపెయిడ్ టాక్సీల త‌ర‌హాలో ఊబ‌రైజేష‌న్ చేస్తామ‌ని చెప్పారు. రేట్లు కూడా స్టండ‌ర్డైజేష‌న్ చేస్తామ‌న్నారు.

పేద‌ల‌కు, సామాన్యుల‌కు చెందాల్సిన ఇసుక ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ‌మ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇసుక‌లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించి ప్రభుత్వానికి చెడ్డ‌పేరు తేవ‌ద్ద‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇసుక అక్ర‌మాలు య‌థేచ్ఛ‌గా జ‌రిగాయ‌ని చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు చెప్పినా స‌రే భ‌య‌ప‌డ‌ని స్థితికి వ‌చ్చార‌న్నారు. త‌ప్పు చేసిన‌వాళ్లు ఎవ‌రూ కూడా త‌ప్పించుకోలేర‌ని, టెక్నాల‌జీ ద్వారా ఇన్వెస్టిగేష‌న్ చేస్తే ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేర‌ని సీఎం చెప్పారు. అధికారులు కూడా సుప్రీం కోర్టు అడిగిన దానికి ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా నిజాలు తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తామ‌న్నారు. ఖ‌నిజ సంప‌ద ప్ర‌భుత్వానికి ఒక ఆదాయ వ‌న‌రు అని అందులో అక్ర‌మాల‌కు తావు లేకుండా చూడాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం