AP Weather Alert : రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. కళింగపట్నంలో 10 సెం.మీ వర్షపాతం నమోదు-rain forecast for uttarandhra for the next 24 hours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Alert : రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. కళింగపట్నంలో 10 సెం.మీ వర్షపాతం నమోదు

AP Weather Alert : రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. కళింగపట్నంలో 10 సెం.మీ వర్షపాతం నమోదు

Basani Shiva Kumar HT Telugu
Sep 27, 2024 06:08 PM IST

AP Weather Alert : ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన (@APSDMA)

ఆంధ్రప్రదేశ్‌పై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. విశాఖలో 9, టెక్కలి, యలమంచిలిలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

సెప్టెంబర్ 28న తేదీ శనివారం రోజున అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

శుక్రవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. 26వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయని.. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. పలు జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి తేలకపాటి వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం వివరించింది.

శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Whats_app_banner