PM Nacitn Inauguration: సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా నాసిన్ - ప్రధాని మోదీ
PM Nacitn Inauguration: నాసిన్.. సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారుతుందని, వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
PM Nacitn Inauguration: నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రం నాసిన్‌ను సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ సంస్థ ప్రముఖ శిక్షణా సంస్థగా మారుతుందని ప్రధాని చెప్పారు.
సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉందని, ఇక్కడకు వచ్చే ముందు లేపాక్షి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. గాంధీజీ అనేకసార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారని, రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారన్నారు. తాను ఎల్లప్పుడు ధర్మం పక్షానే నిలుస్తానని రాముడు చెప్పారని మోదీ పేర్కొన్నారు.
ఆధర్మ మార్గంలో వచ్చేది ఇంధ్ర ప్రస్థమైనా తనకు అక్కర్లేదని రాముడు అన్నారని అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పారన్నారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్నారు.
“నాసిన్.. దేశంలో ఆధునిక ఎకో సిస్టమ్‌గా మారనుంది” అని చెప్పారు. నాసిన్.. కస్టమ్స్, పన్నులు, నార్కొటిక్స్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మారనుందన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేది - మన పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని, భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్లు పన్నులు ఉండాలన్నారు.
జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని, ఆదాయపన్ను చెల్లింపు విధానం కూడా సులభతరం చేశామన్నారు. ఏటా రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నాయని, తాము అధికారంలోకి వచ్చాక ఆదాయపన్ను పరిమితి పెంచామన్నారు.
దేశంలో ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోందన్నారు. వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామన్నారు. తమ పథకాలు కాగితాలపై కాదని .. క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని చెప్పారు.
పేదల సమస్యలు తొలగించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలని, 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వారికోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీని ప్రారంభించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్ తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి అద్భుత శిల్ప సంపద… ప్రధాని మోదీ
పాలసముద్రంలో నాసిన్ ప్రారంభోత్సవానికి ముందు లేపాక్షిలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడి శిల్ప సంపద చూసి మైమరిచిపోయారు. తోలు బొమ్మలాటలను తిలకించారు.
భారత పురాతత్వ చరితంలో "లేపాక్షి" శిల్ప సంపద ఓ మహా అద్భుతం అని.. దేశ ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. చారిత్రాత్మక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిలో వీరభద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా లేపాక్షి హెలీప్యాడ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. లేపాక్షిలో పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళా ఖండాల విశిష్టత గురించి తెలుసుకున్నారు. భారతీయ చారిత్రక పురాతన వైభవానికి, విజయనగర సామ్రాజ్య సంస్కృతీ, శిల్పకళా సంపదకు ప్రత్యక్ష అనవాళ్లుగా.. లేపాక్షి ఆలయ శిల్పకళా ఖండాలు ప్రతిబింభిస్తున్నాయని ఆయన అభివర్ణించారు. భారతీయ పురాతన చరితాత్మక వారసత్వ సంపదను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
లేపాక్షికి విచ్చేసిన దేశ ప్రధానిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు, బిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానమంత్రి పర్యట సందర్భంగా లేపాక్షి క్షేత్రంలో ప్రధాని కార్యాలయ భద్రతాధికారులు, రాష్ట్ర పోలీసు, అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రంలో నూతనంగా నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.