Pocso Judgement: బాలుడిపై హత్యాచారం చేసిన ఆర్మీ ఉద్యోగికి యావజ్జీవ ఖైదు విధించిన ప్రకాశం జిల్లా కోర్టు
Pocso Judgement: బాలుడిపై అత్యాచారానికి పాల్పడి నేరం బయటపడకుండా చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆర్మీ జవానుకు న్యాయస్థానం కఠిన శిక్షను ఖారు చేసింది. నిందితుడి హేయమైన నేరానికి యావజ్జీవ కారాగారవాసంతో పాటు రూ.50వేలు జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది.
Pocso Judgement: బాలుడిపై లైంగిక దాడి చేసి నేరం బయటపడకుండా హత్య చేసిన నిందితుడికి ప్రకాశం జిల్లా పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరాు చేసింది. నిందితుడికి రూ.50 వేలు జరిమానా విధించింది. హత్యాచారానికి గురైన బాలుడి తల్లిదండ్రులకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కోర్టు సూచించింది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన దొనపాటి వెంకట ప్రశాంత్ ఆర్మీ సైనికుడిగా పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని భటిండాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుండేవాడు. సంక్రాంతి సెలవులకు రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడటంలో పాటు, స్నేహితురాలితో చాటింగ్ చేస్తుండే వాడు. 2022 జనవరి 22 తేదీ రాత్రి అశ్లీల వీడియోలు చూస్తూ ఉద్రేకానికి గురయ్యాడు.
కోరికలను అదుపు చేసుకోలేక, ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ఆడుకుంటున్న బాలల వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఒక బాలుడు (11)ని ద్విచక్ర వాహనంపై గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అతనితో అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలుడు ఈ విషయాన్ని ఇంట్లో చెబుతానని ఏడుస్తుండడంతో నిందితుడు బాలుడిని గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం మృతదేహానికి రాయి కట్టి నీటితో ఉన్న బావిలో పడేశాడు.
బాలుడు ఇంటికి రాకపోవడంతో కుంటుంబ సభ్యులు మర్నాడు గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మూడు రోజుల తరువాత మృతదేహం బావి నీటిపై తేలింది. దీంతో పోలీసులు హత్య కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు నిందితుడితో కలిసి వెళ్లడాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు చిత్ర హింసలకు గురి చేస్తారేమోనని భయాందోళనకు గురైన నిందితుడు ప్రశాంత్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసు విచారణను గురువారం చేపట్టిన ఒంగోలు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఏడో అదనపు జిల్లా జడ్జి టీ.రాజా వెంకటాద్రి తీర్పు వెలువరించారు. బాలుడిపై ఉన్మాదంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితుడు వెంకట ప్రశాంత్ బతికినంత కాలం జైలు శిక్ష అనుభవించాలని జడ్జి టీ.రాజా వెంకటాద్రి తీర్పు ఇచ్చారు. నిందితుడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించారు. బాధిత బాలుడి తల్లిదండ్రులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు జడ్జి సూచించారు.
( రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)