AP Politics : ఏపీలో మళ్లీ 'పొత్తుల' రాజకీయం - మారనున్న సమీకరణాలు..!
Andhrapradesh Politics: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. టీడీపీ - జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిన వేళ…సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉండగానే… ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పొత్తులవైపు అడుగులేశాయి. అధికార పార్టీ మాత్రం తాము సింగిల్ గానే వస్తామని తేల్చి చెప్పేసింది. అయితే ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే… ఏకతాటిపై కలిసి నడవాలని నిర్ణయించాయి తెలుగుదేశం, జనసేన. ఈ మేరకు రాజమహేంద్రవరం వేదికగా కీలక ప్రకటన చేశాయి. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో మరోసారి పొత్తు పొడిచినట్లు అయింది. ఈ పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు అత్యంత హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో…. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. వైసీపీని ఎదుర్కొనేందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. నిజానికి జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ఇంత కాలం పొత్తు ప్రాథమికంగా చర్చల దశలోనే ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో… పొత్తును ఖరారు చేసేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశం ఉందన్న సంకేతాలు ఎప్పటి నుంచో ఉన్నా స్పష్టమైన ప్రకటన రాక నేతలు, కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొని ఉండే. ఇలాంటి సమయంలో పొత్తుపై స్పష్టమైన ప్రకటన రావటంతో ఇరు పార్టీల కేడర్ లో ఉన్న సందిగ్ధతలన్నీ తొలగిపోయాయనే చెప్పొచ్చు.
మారనున్న సమీకరణాలు…!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడవటంతో సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికి వరకు ఎవరికి వారుగా అన్నట్లు పని చేస్తూ వచ్చారు. ఇకపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. మొన్నటివరకు బీజేపీతో ఉన్న పవన్… ఇప్పుడు టీడీపీవైపు మళ్లటంతో వారి నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా మూడు పార్టీలు కలవాలనేది పవన్ ఆకాంక్ష. కానీ ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా స్పందన రావటం లేదు. ఈ నేపథ్యంలో…జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదరటంతో…బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే ధీమాను పవన్ వ్యక్తం చేసినప్పటికీ… అలా జరగకపోయినా రెండు పార్టీలే(టీడీపీ - జనసేన) ముందుకెళ్తాయనే విషయాన్ని చెప్పేశారు. ఒకవేళ బీజేపీ కలిసిరాకపోతే… ఒంటరిగానే బరిలో ఉండే అవకాశం ఉంటుంది. అధికార వైసీపీ ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉండగా… టీడీపీ, జనసేన పొత్తువైపు కూడా మళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే తమతో కాకుండా ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ విషయంలో కమలనాథులు ఎలా స్పందిస్తారనేది కూడా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
ఇక తెలుగుదేశం - జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ… సీట్ల పంపకాల విషయమే అతిపెద్ద టాస్క్ గా తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన కంటే టీడీపీలోని నేతలే ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంది. జనసేన ఎన్ని స్థానాలను కోరుతుంది..? టీడీపీ ఎన్నింటికి ఓకే అంటుంది..? అనేది పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఇక నియోజకవర్గాల్లో పార్టీ కోసం పని చేస్తున్న ముఖ్య నేతలు…. పొత్తులో భాగంగా తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో…. నేతల నుంచి అధినాయకత్వంపై ఒత్తిడి ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుంది. పార్టీలు మారే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నింటిని ఎలా అధిగమిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.