Vande Bharat : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని-విశాఖ, సికింద్రాబాద్ నుంచి అందుబాటులోకి
Vande Bharat Trains : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం, నాగ్ పూర్-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. విశాఖలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
Vande Bharat Trains : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం, నాగ్ పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించారు. అయితే సికింద్రాబాద్-నాగ్ పూర్ వందే భారత్ రైలు ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్, భువనేశ్వర్-విశాఖ, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజా రైళ్లతో ఈ సంఖ్య మరింత పెరిగింది. దుర్గ్-విశాఖ వందే భారత్...రాయ్ పూర్-విజయనగరం మార్గంలో మొదటిది.
దుర్గ్-విశాఖపట్నం(నెం.20829) వందే భారత్ రైలు దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారం తప్ప) నడపనున్నారు. ఈ రైలు ప్రతి రోజు ఉదయం 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.45 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు(నెం.20830) విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారం మినహా) ప్రతి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మేకిన్ ఇండియాకు వందే భారత్ ఒక ఉదాహరణ- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ రైలును ప్రధాని మోదీ వర్చుల్ ప్రారంభించగా... విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, డీఆర్ఎం ఈ రైలులో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వందే భారత్ రైలుతో భారతదేశ సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా కాన్సెప్ట్ నకు వందే భారత్ రైళ్లు ఒక ఉదాహరణ అన్నారు. విశాఖ-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, పార్వతీపురంలో రైలు హాల్టింగు ఇచ్చినందుకు రైల్వే మంత్రికి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విశాఖ నుంచి మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, తాజా రైలుతో వీటి సంఖ్య నాలుగుకు పెరిగిందన్నారు. అలాగే ఏపీకి మరిన్నీ రైలు సర్వీసులు వచ్చేలా చూస్తానన్నారు.
సంబంధిత కథనం