Nomadic tribes: కలెక్టర్ చొరవతో సంచార కుటుంబాలకు శాశ్వత ధృవీకరణలు
Nomadic tribes: దశాబ్దాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన సంచార తెగల కుటుంబాలకు కలెక్టర్ చొరవతో గుర్తింపు లభించిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. ఏళ్ల తరబడి స్థిర నివాసాలు లేక చదువు, సంక్షేమానికి దూరమైన వారికి ఆధార్‌తో పాటు ఇతర ధృవీకరణలు మంజూరయ్యాయి.
Nomadic tribes: సంచార జీవనం సాగిస్తూ ప్రభుత్వ సంక్షేమానికి దూరమైన కుటుంబాలకు కలెక్టర్ చొరవతో గుర్తింపు లభించిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. దశాబ్దాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండానే జీవనం సాగిస్తున్న వారికి ఇన్నేళ్లకు గుర్తింపు లభించింది. కలెక్టర్ ఆదేశాలతో రెవిన్యూ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఏళ్ల తరబడి జనన ధ్రువీకరణలు, ఆధార్ కార్డులు లేక సంచార జాతుల ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలను పొందలేక పోవడాన్ని గుర్తించి సత్యసాయి జిల్లా కలెక్టర్ వారికి ధృవీకరణలు అందించడానికి సహకరించారు. దుర్భర పేదరికంలో స్థిర నివాసాలు కూడా లేక తాత్కలిక గుడిసెల్లో మగ్గుతున్న విషయాన్ని గుర్తించడంతో దశాబ్దాల సమస్య పరిష్కారమైంది.
సత్యసాయి జిల్లాలో మండల కేంద్రమైన కొత్తచెరువులో 73 మంది సంచార జాతి ప్రజలు ఉన్నారు. దశాబ్దాల క్రితం చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చి కొత్త చెరువులో గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. పల్లెల మీదకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకు వెళ్లి వ్యాపారాలు చేసుకొని వచ్చి ఇక్కడే సంసారాన్ని కొనసాగిస్తున్నారు.
స్థిర నివాసాలు లేకపోవడంతో ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు పొందలేక పోయారు. ఆధార్ కార్డు లేని కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు అందుకోలేక పోయారు. జనన ధ్రువీకరణ పత్రం లేనందున ఆధార్ కార్డు పొందే అవకాశం లేకుండా పోయింది. పిల్లలు చదువుకు దూరం అయ్యారు. మొదట జనన ధ్రువీకరణ పత్రం తీసుకుంటే ఆధార్ కార్డును తీసుకోవచ్చు. దశాబ్దాలుగా వీరి సమస్యను పట్టించుకున్న అధికారి లేడు. ప్రభుత్వాలు మారుతున్నా ఓటు కూడా లేని వీరిని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
ఎలాంటి సంక్షేమ పథకాలు పొందలేక పేదరికంలోనే మగ్గిపోతున్న వీరంతా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందన కార్యక్రమంలో పరిస్థితిని వివరించడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తక్షణమే జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసి, ఆధార్ కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో రెవిన్యూ అధికారులు, పంచాయితీ అధికారులు ఆగ మేఘాల మీద జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. మొత్తము 74 మందికి జనన ధ్రువీకరణ పత్రాలను మంగళ, బుధ వారాల్లో మంజూరు చేశారు. కొత్తచెరువులోని పంచాయతీ కార్యాలయం లబ్దిదారులకు జనన ధృవీకరణ పత్రాలు అందజేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావడంతో ఆధార్ కార్డులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో దశాబ్దాల నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేకపోయినా పేద ప్రజల ముఖాల్లో ఆనందం వ్యక్తం అయింది.
45 ఏళ్ల వయసున్న కిష్ణప్పకు ఇంతవరకు ఆధార్ కార్డు కూడా లేదని బాధపడేవాడినని సంతోషం వ్యక్తం చేశాడు. ఆధార్ కార్డు సెంటర్ వద్దకు వెళ్తే జనన ధ్రువీకరణ పత్రం లేనందున ఆధార్ కార్డు వీలు కాదని చెప్పారన్నారు. ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందకోలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ సార్ కృషివల్లే జనన ధ్రువీకరణ పత్రాలు పొందామని సంతోషం వ్యక్తం చేశారు.
60ఏళ్లు దాటిన సుంకమ్మకు కూడా ఇలాగే ఆధార్ లేకపోవడంతో సంక్షేమ పథకాలు వర్తించలేదు. వృద్ధాప్య పింఛనుతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము పొందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి పథకానికి ఆధార్ కార్డు అవసరమున్నందున ఆధార్ కార్డు లేకపోవడంతో పథకాలు రాలేదని కనీసం రేషన్ కార్డు కూడా లేదని వా పోయారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని, వీటి ద్వారా ఆధార్ కార్డు వస్తుందన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని అధికారులు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ధృవీకరణ ఇచ్చిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సంచార కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు కనీసం పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని 23ఏళ్ల గంగ తెలిపింది. ఆధార్ కార్డు లేకపోవడంతో ఇంటి స్థలం పొందలేక గుడిసెల్లోని నివాసం ఉంటున్నామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం జరిగిన జనన ధ్రువీకరణ పత్రం పొందానని ఆధార్ కార్డు తీయించుకుంటానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఇంటి పట్టా మంజూరు చేయాలని ఈ కుటుంబాల్లోని ప్రజలు విజ్ఞప్తి చేశారు.