AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు-రైతులకు అలర్ట్
AP Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తూర్పు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ 25న(సోమవారం) వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27,28,29 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.
ఇవాళ(నవంబర్ 23) ఉదయం 08.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని, ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం మెదక్ లో 11. 4 సెల్సియస్ డిగ్రీలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో రెండు మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీంతో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. పగటి పూట వాతావరణం చల్లగా ఉండటంతో కరెంట్ వినియోగం తగ్గినట్లు అధికారులు తెలిపారు. గత వారం గరిష్ఠ డిమాండ్ 3,300 మెగావాట్ల వరకు రికార్డు అయ్యంది. గురువారం సిటీలో 250 మెగావాట్ల వరకు డిమాండ్ తగ్గినట్లు అధికారులు తెలిపారు. గత వారంలో నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 12.4 డిగ్రీలు నమోదైంది.
సంబంధిత కథనం