Pawan Kalyan : మహారాష్ట్రలో కలిసొచ్చిన పవన్ ప్రచారం, ఆ 11 స్థానాల్లో మహాయుతి విజయం
Pawan Kalyan : మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దూరదృష్టికి మహారాష్ట్ర ప్రజలు మరోసారి పట్టంకట్టారని స్పష్టం చేశారు. పవన్ ప్రచారం చేసిన 11 స్థానాల్లో మహాయుతి విజయం సాధించిందని జనసేన ప్రకటించింది.
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. కూటమి పార్టీల నేతలకు ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ అభినందలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధి, నిజాయితీ, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతం, సనాతన ధర్మం, విభజనపై ఐక్యత, విక్షిత్ భారత్, విక్షిత్ మహారాష్ట్ర నిర్మాణానికి ఒక దృక్పథాన్ని ఎంచుకున్నారన్నారు. సత్యం, శౌర్యం, న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భూమి మరోసారి ప్రగతి పథాన్ని ఎంచుకుందని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
కొత్త మహారాష్ట్ర ప్రభుత్వం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి పని చేస్తుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారతదేశ దృష్టికి గణనీయంగా దోహదపడుతుందన్నారు. మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తనకు ఎంతో విశేషం అన్నారు. ప్రచారం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలు తనపై అపారమైన ప్రేమ, నమ్మకాన్ని చూపారన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సహకారాన్ని కొనసాగించాలని ఎదురుచూస్తున్నామన్నారు.
10 అసెంబ్లీ , 1 ఉపఎన్నిక స్థానాల్లో మహాయుతి నేతలు విజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. జనసేనాని ప్రచారం చేసిన, రోడ్ షో నిర్వహించిన అసెంబ్లీ స్థానాల్లో లాతూరు సిటీ స్థానం మినహా అన్నింటా మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజులపాటు 11 అసెంబ్లీ స్థానాలు, ఉపఎన్నిక జరిగిన నాందేడ్ పార్లమెంట్ స్థానంలోని అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే 10 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్ లోక్ సభ స్థానంలో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లోని కీలకమైన నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. నాందేడ్ పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోక్ రావు మారుత్ రావు హంబర్దే విజయం దక్కించుకున్నారు. డేగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అంతపుకార్ జితేష్ రావ్ సాహెబ్, భోకర్ నుంచి జయశ్రీ అశోక్ రావ్ చవాన్, షోలాపూర్ సెంట్రల్ నుంచి దేవేంద్ర రాజేశ్ కోటె, షోలాపూర్ నార్త్ నుంచి దేశ్ ముఖ్ విజయ్ సిద్దరామప్ప, షోలాపూర్ సౌత్ నుంచి దేశ్ ముఖ్ సుభాష్ సురేష్ చంద్ర, బల్లార్ పూర్ నుంచి ముంగటివార్ సుధీర్ సచ్చిదానంద్, చంద్రాపూర్ నుంచి జోగేశ్వర్ కిషోర్ గజానన్, పుణె కంటోన్మెంట్ నుంచి సునీల్ ధ్యాన్ దేవ్ కాంబ్లే, కస్బాపేట్ నుంచి హేమంత్ నారాయణ్ రసానే, హడప్సర్ నుంచి చేతన్ విఠల్ తుపే తరఫున రోడ్ షోలు, బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
కలిసొచ్చిన పవన్ ప్రచారం
మహారాష్ట్ర అభివృద్ధికి, మరాఠా ప్రజల ఐక్యత కోసం సుస్థిరమైన మహాయుతి కూటమికి పట్టం కట్టాలని పవన్ కల్యాణ్ ప్రచారంలో కోరారు. బహిరంగ సభల్లోనూ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే మహారాష్ట్ర అభివృద్ధి ఎంత అవసరమో, దానికి సమర్ధమైన పాలన ఇంకెంత అవసరమో చెబుతూ ప్రజల్లో చైతన్యం నింపారని జనసేన తెలిపింది. పవన్ కల్యాణ్ పాల్గొన్న ప్రతి సభకు మరాఠా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని జనసేన పేర్కొంది. ముఖ్యంగా షోలాపూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, కస్బాపేట్ లలో నిర్వహించిన రోడ్ షోలలో పవన్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపింది. మహాయుతి విజయాలకు పవన్ కల్యాణ్ ప్రచారం ఎంతో దోహదం చేసిందని ఆ పార్టీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం