YS Sharmila: రెండేళ్లు దేనికి.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అంటూ షర్మిల ఆగ్రహం..
YS Sharmila: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లు కొనసాగించాలన్న వైవీ. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అని మండి పడ్డారు.
YS Sharmila: హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే… ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా అని షర్మిల ప్రశ్నించారు.
మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు...ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదని పేర్కొన్నారు.
కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని, కొత్త పరిశ్రమలు లేవని, ఉన్నవి ఎక్కడ ఉంటాయో లేదో తెలియదన్నారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా...అభివృద్ధి చూపలేదన్నారు.
మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని, ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి నెలకొందన్నారు.
చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే…మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అని షర్మిల మండిపడ్డారు. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను.. కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని ఆరోపించారు.
ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప, వైసీపీకి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని, ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే అర్ధం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ షర్మిల్ ట్వీట్ చేశారు.
జగన్ మీద మోదీ చర్యలు ఏవి…మాణిక్కం ఠాగూర్
రాష్ట్రంలో యథేచ్చగా మైనింగ్ అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుంది అని కేంద్రం నివేదిక ఇచ్చిందని,అయినా మోడీ ప్రభుత్వం ఎందుకని జగన్ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
వందల కోట్ల లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ తరపున మోడీని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం 16 సార్లు లోక్ సభ రాజ్య సభల్లో మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికిందని, పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
బీజేపీకి జగన్ ఎంపీ ల మద్దతు కావాలని ,అయినా జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను అడగకుండా మోడీ ప్రభుత్వానికి బైండోవర్ అయ్యారని ఆరోపించారు.