Pawan In NDA: ఎన్టీఏలోనే ఉన్నా, బయటకు రాలేదంటున్న పవన్ కళ్యాణ్-pawan kalyan says that even though he is still in nda he is not coming out ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan In Nda: ఎన్టీఏలోనే ఉన్నా, బయటకు రాలేదంటున్న పవన్ కళ్యాణ్

Pawan In NDA: ఎన్టీఏలోనే ఉన్నా, బయటకు రాలేదంటున్న పవన్ కళ్యాణ్

Sarath chandra.B HT Telugu
Oct 06, 2023 11:22 AM IST

Pawan In NDA: ఎన్డీఏ నుంచి బయటకొచ్చి టీడీపీకి మద్దతిస్తున్నానని పవన్ కళ్యాణ్‌ పెడనలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ముదినేపల్లిలో మళ్లీ వివరణ ఇచ్చారు. తాను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నానని ప్రకటించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Pawan In NDA: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. పెడన వారాహి యాత్రలో బలహీనంగా ఉన్న టీడీపీని ఆదుకోడానికి ఎన్డీఏ నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్ కళ్యాణ్, గురువారం తాను ఎన్డీఏలోనే ఉన్నానని ప్రకటించారు. తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదని పవన్ వారాహి యాత్రలో వివరణ ఇచ్చారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.

“ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే తా స్వయంగా ప్రకటిస్తానని, తన తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదన్నారు.” నేను బయటకు రావాలంటే అందరికీ చెప్పే వస్తాను తప్ప దొంగచాటుగా ఏ పని చేయనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాలంటే తనకు అపారమైన గౌరవం ఉందని పవన్ చెప్పుకొచ్చారు.ః

రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ పెద్దలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఆశీస్సులతో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని.. 2021 జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే చెప్పానన్నారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పానన్నారు. దానికి అనుగుణంగా కలిసివచ్చిన పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. అధికార పార్టీల దాష్టీకం, దౌర్జన్యాలు పెరిగిపోయినప్పుడు అంతా సమష్టిగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. 1970 దశకంలో అత్యవసర సమయంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు కలిసి సమష్టిగా ఎదుర్కొన్నాయని ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కలిసి ఎదుర్కొకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని చెప్పారు.

2014లో దేశం కోసం ఆలోచించే మోదీకి, రాష్ట్ర క్షేమం కోసం అనుభవం ఉన్న చంద్రబాబుకు సంపూర్ణంగా మద్దతు తెలిపానని అన్నిటికీ తెగించే అప్పట్లో మద్దతు ఇచ్చానని చెప్పారు. ఆ రోజుల్లో ఆ రెండు పార్టీలు గెలవకపోయి ఉంటే జనసేన పరిస్థితి ఏంటన్నారు. రాజకీయ ప్రస్థానం అప్పుడే మొదలు పెట్టిన పార్టీని మనుగడ సాగనిచ్చేవారా అని ఓటమి అయినా, గెలుపు అయినా స్థిరంగా ప్రజల కోసం నిలిచే వ్యక్తినని చెప్పారు.

మేమంటే ఎందుకంత భయం..?

రాష్ట్రంలో రెండు పార్టీలకు ఏ మాత్రం బలం లేనపుడు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు. తాము తీసుకునే నిర్ణయాలను, మాటలకు మీకెందుకు ఉలికిపడుతున్నారన్నారు. తమ రాజకీయ విధానపరమైన నిర్ణయాలు మేం తీసుకుంటామని 175 సీట్లను గెలుస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు తమ రెండు పార్టీల నిర్ణయాలు, విధానాలపై ఎందుకు కంగారుపడుతున్నారన్నారు. జగన్ ఓటమి భయమే తమ బలమని ఓటమి మీ కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టే మీకు మేం ఏం చేసినా, మాట్లాడినా వణుకు పుడుతోందన్నారు.

Whats_app_banner