Papikondalu Tourism : మళ్లీ ప్రారంభమైన పాపికొండలు బోటు ట్రిప్, టూర్ ప్యాకేజీ బుకింగ్ ఇలా!
Papikondalu Tourism : ఏపీలో పాపికొండలు టూర్ మళ్లీ ప్రారంభం అయ్యింది. నేటి నుంచి పర్యాటకులను బోట్లలో పాపికొండల ట్రిప్ నకు అనుమతిస్తున్నారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత మళ్లీ లాంచీలు బయలుదేరాయి. పర్యాటకులు ఏపీ టూరిజం వెబ్ సైట్ ద్వారా టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
ఏపీలో గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు బోట్ ట్రిప్ మళ్లీ ప్రారంభం అయ్యింది. నేటి నుంచి పాపికొండలు టూర్ తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇక నుంచి ప్రతి రోజూ టూర్ ఉంటుందని టూరిజం శాఖ తెలిపింది. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం టూర్ ను తిరిగి ప్రారంభించింది. పాపికొండల్లో ఒకట్రెండు రోజులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని టూర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా...పాపికొండల మధ్య గోదావరిలో సాగే ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను మంత్రమగ్ధులను చేస్తుంది.
నేటి నుంచి బోటు టూర్ ప్రారంభం
పాపికొండలు బోటు టూర్ లను విజయదశమి నుంచి తిరిగిప్రారంభించినట్లు టూరిజం యూనియన్ నేతలు తెలిపారు. పాపికొండల బోటులను చింతూరు ఐటీడీఏ పీఓ ప్రారంభిస్తారని యూనియన్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 21 బోట్లు ఉండగా... వీటిలో 9 బోట్లకు టూరిజం శాఖ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి కొద్ది రోజుల్లో అనుమతులు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. నేటి నుంచి పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా లేదా ఏజెంట్ల ద్వారా టూర్ టికెట్లు బుకింగ్ చేసుకుని పాపికొండల్లో పర్యటించవచ్చని తెలిపారు. పర్యాటకుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటుచేశామన్నారు. శనివారం నుంచి మయూరి, రామ రెండు బోటులు నడుపుతున్నట్లు చెప్పారు.
పాపికొండలు టూర్ రాజమండ్రి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీని ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్‌లు అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ దేవాలయం వరకు వాహనాల్లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు లాంచీల్లో గోదావరిలో ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం 2.00 గంటలకు పాపికొండల వద్దకు చేరుకుంటారు. కొద్ది సమయం అక్కడ గడిపి తిరిగి బోటులో సాయంత్రానికి గండిపోచమ్మ ఆలయానికి చేరుకుంటారు. అనంతరం రాజమండ్రికి తీసుకొస్తారు.
టూర్ లో కవర్ చేసే ప్రదేశాలు
పాపికొండలు టూర్ ప్యాకేజీ ధర ఒకరికి రూ.1000 వరకు ఉంటుంది. గండి పోచమ్మను దర్శించుకున్న తర్వాత టూర్ ప్రారంభం అవుతుంది. గోదావరిలో లాంచీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. నదికి ఇరువైపులా పాపికొండలు మధ్యలో లాంచీ ప్రయాణం...వింత అనుభూతిని కలిగిస్తుంది. ఈ టూర్ లో పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు చూడవచ్చు. ప్రయాణ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం చాలా ముఖ్యం. అసౌకర్యంగా ఉన్నాయని వాటిని ధరించకపోతే... ప్రమాద సమయాల్లో విషాదం తప్పదని నిర్వాహకులు హెచ్చరిస్తుంటారు.
పర్యాటకులు https://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో పాపికొండలు టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోచ్చు. ఈ వెబ్ సైట్ లో రాజమండ్రిలోని బడ్జెట్ హోటళ్లను బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం