Papikondalu Tour Cancelled : పాపికొండల విహారయాత్రకు బ్రేక్, గోదావరి వరద ఉద్ధృతితో బోటు ప్రయాణాలు రద్దు-east godavari papikondalu tours stalled due to heavy rains godavari floods ap govt cancelled tours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Papikondalu Tour Cancelled : పాపికొండల విహారయాత్రకు బ్రేక్, గోదావరి వరద ఉద్ధృతితో బోటు ప్రయాణాలు రద్దు

Papikondalu Tour Cancelled : పాపికొండల విహారయాత్రకు బ్రేక్, గోదావరి వరద ఉద్ధృతితో బోటు ప్రయాణాలు రద్దు

HT Telugu Desk HT Telugu

Papikondalu Tour Cancelled : ఏపీలోని పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. ఎగువ నుంచి గోదావరికి వరద పెరుగుతుండడంతో, ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం పాపికొండల టూర్ ను తాత్కాలికంగా నిలిపివేసింది.

పాపికొండల విహారయాత్రకు బ్రేక్, గోదావరి వరద ఉద్ధృతితో బోటు ప్రయాణాలు రద్దు

Papikondalu Tour Cancelled : ఆంధ్రప్రదేశ్‌లో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. ఈ పర్యటకాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.‌ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నదిపై సాగే పాపికొండల విహార యాత్ర పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే ఇతర రాష్ట్రాల పర్యాటకులు కూడా పాపికొండల పర్యటకానికి వస్తుంటారు. గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం ఉంటుంది. జలపాతాలు, గ్రామీణ వాతావరణంతో విహారయాత్ర మొత్తం ఆహ్లాదకరంగా సాగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని రుతు పవనాల విస్తరించడంతో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.‌

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో తుపాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు గోదావరి నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో పాపికొండలు విహార యాత్రకు బ్రేక్ పడింది. ఐఎండీ తాజాగా రాష్ట్రంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు పాపికొండల విహార యాత్రను నిలిపివేస్తున్నామని, ఆ తరువాత పరిస్థితులను బట్టీ యాత్రపై ఆదేశాలిస్తామని అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా యాత్రకు వెళ్తే, చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

2018లో పాపికొండల విహార యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.‌ 2019 సెప్టెంబరు నెలలో కచ్చలూరు బోటు ప్రమాదం తరువాత పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 2021 నవంబర్ 7వ తేదీన పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. అయితే ఆ ప్రమాదం కొన్ని గుణపాఠాలు నేర్పింది. దీంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పాపికొండల విహార యాత్రను రద్దు చేసున్నారు. ఇప్పుడు కూడా ఐఎండీ ఇచ్చిన తుపాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. పాపికొండల పర్యటన కోసం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోట్లను‌ నిలిపివేసింది. నాలుగు రోజుల తరువాత అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బోట్ల విహార యాత్రపై నిర్ణయం తీసుకుంటారు.

జాతీయ వనంగా గుర్తింపు పొందిన పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే తెలంగాణలోని భద్రాచలానికి కూడా దాదాపుగా అదే దూరం ఉంటుంది. రెండు పర్వత శ్రేణులుగా ఉండే పాపికొండల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. రాజమండ్రి నుంచి దేవీపట్నం మండలంలోని పోచమ్మ గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడ లాంచీలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు, పేరంటాళ్లపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. మధ్యలో లాంచీని ఆపుతారు. అక్కడ బొంగులో చికెన్ ఫేమస్. పర్యటనకులు తప్పనిసరిగా బొంగులో చికెన్ రుచి చూస్తారు. తెలంగాణలోని భద్రాచలం నుంచి అయితే, తూర్పుగోదావరి జిల్లాలోని వీఆర్ పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరుకోవచ్చు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం