AP Drone Pilot : పదో తరగతి చదువు చాలు.. నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం!-opportunity to earn one lakh rupees per month if get drone pilot training ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Drone Pilot : పదో తరగతి చదువు చాలు.. నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం!

AP Drone Pilot : పదో తరగతి చదువు చాలు.. నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం!

Basani Shiva Kumar HT Telugu
Nov 04, 2024 01:45 PM IST

AP Drone Pilot : సొంత ఊర్లోనే ఉంటూ మంచి జీతం పొందే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అవకాశం వచ్చినా.. చదువు, శిక్షణ వంటివి అవసరం. కానీ.. పదో తరగతి చదువు, 5 రోజుల శిక్షణతో.. మంచి జీతం పొందే అవకాశం వచ్చింది. దీంతో నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

డ్రోన్ పైలట్ కోర్సు
డ్రోన్ పైలట్ కోర్సు

డ్రోన్.. ఇప్పుడు ప్రతీ రంగంలో కీలకంగా మారుతోంది. విపత్తుల సమయంలో సాయం మొదలు.. రక్షణ రంగంలో సైనికులకు తోడు వరకూ.. అంతటా డ్రోన్ల వినియోగం పెరిగింది. ఇటీవల వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

తాజాగా.. డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు స్మిత్‌ షా కీలక విషయాలు వెల్లడించారు. కేవలం పదో తరగతి విద్యార్హత ఉంటే, ఐదు రోజుల్లోనే శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలట్‌ కావచ్చని చెప్పారు. దీనికి సంబంధించి శిక్షణ పొందితే.. గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనుల్లో డ్రోన్‌ సేవలను అందించడం ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు.

స్మిత్‌ షా చెప్పిన 7 అంశాలు..

1.2030 నాటికి డ్రోన్‌ పరిశ్రమ మార్కెట్‌ రూ.92,500 కోట్లకు పెరగనుంది. ఇందులో ఉత్పత్తి, సేవలు, శిక్షణ ఇతర అన్ని వాణిజ్య వ్యవహారాలూ ఉన్నాయి. రాబోయే పదేళ్లలో డ్రోన్‌ రంగంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌ అవుతుంది.

2.కొత్త రంగాల్లో డ్రోన్‌ సేవలు విస్తరించనున్నాయి. భారత సైన్యంతోనూ సమన్వయ, సన్నాహక సమావేశం ఇటీవలే జరిగింది. సైబర్‌ సెక్యూరిటీ వంటి వాటిలోనూ డ్రోన్లను వినియోగంలోకి తెచ్చే కసరత్తు జరుగుతోంది.

3.దేశంలో 4 వందలకు పైగా డ్రోన్‌ తయారీ సంస్థలు ఉన్నాయి. రెండు పెద్ద కంపెనీలు మినహా అన్నీ స్టార్టప్‌లే. కార్గో, వ్యవసాయం, రక్షణ, సర్వే- మ్యాపింగ్‌ వంటి ప్రధాన రంగాల్లో డ్రోన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

4.ప్రభుత్వ, అకడమిక్, ప్రైవేటువీ కలిపి దేశంలో 120 సర్టిఫైడ్‌ శిక్షణ సంస్థలున్నాయి.

5.కేవలం 5 రోజుల పైలట్‌ కోర్సు శిక్షణకు రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఫీజు ఉంటుంది. డ్రోన్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేయాలి. వీటిని ఆపరేట్‌ చేసే పైలట్‌కు లైసెన్స్‌ కావాలి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ఉండాలి.

6. మన దేశంలో 90 శాతం ఎయిర్‌స్పేస్‌ గ్రీన్‌జోన్‌గానే ఉంది. దీంతో డ్రోన్‌ రంగానికి గొప్ప అవకాశం వచ్చింది.

7.ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేలా చంద్రబాబు విజన్‌తో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని.. స్మిత్‌ షా అభిప్రాయపడ్డారు.

Whats_app_banner