Bar licenses : బార్‌ లైసెన్స్‌ దరఖాస్తుకు వ్యాపారుల వెనుకంజ...-andhra pradesh bar license auction on saturday and sunday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bar Licenses : బార్‌ లైసెన్స్‌ దరఖాస్తుకు వ్యాపారుల వెనుకంజ...

Bar licenses : బార్‌ లైసెన్స్‌ దరఖాస్తుకు వ్యాపారుల వెనుకంజ...

HT Telugu Desk HT Telugu
Jul 30, 2022 09:55 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో బార్‌లలో మద్యం విక్రయాలకు వ్యాపారులు వెనకాడుతున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న బార్‌లైసెన్స్‌ల గడువు ముగియడంతో కొత్త వాటి ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇచ్చినా దరఖాస్తుదారులు వెనక్కి తగ్గుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు భారీగా పెరగడంతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరగడం వల్ల వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.

<p>బార్‌ లైసెన్స్‌ దరఖాస్తులు తగ్గుముఖం</p>
బార్‌ లైసెన్స్‌ దరఖాస్తులు తగ్గుముఖం (unsplash)

ఆంధ్రప్రదేశ్‌లో బార్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొత్త దరఖాస్తుల ద్వారా రూ.100కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేసినా లక్ష్యాలను చేరుకోలేకపోయారు. దరఖాస్తులు రాకపోవడం ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడింది. లైసెన్స్‌ ఫీజులు భారీగా పెరగడంతో పాటు ఇతర కారణాలతో చాలామంది వ్యాపారం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయి.

ఏపీలో మూడేళ్ల పాటు బార్‌లలో మద్యం విక్రయించేందుకు విడుదలైన నోటిఫికేషన్‌కు అంచనాలకు తగ్గట్లుగా దరఖాస్తులు రాలేదు. ప్రాథమికంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు సైతం వెనక్కి తగ్గారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయితీలు, పర్యాటక ప్రాంతాల్లో మొత్తం 838 ప్రాంతాల్లో కొత్త బార్‌లను ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్సైజ్‌ శాఖ ప్రకటనతో దాదాపు 1672మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి మాత్రం చాలామంది వెనక్కి తగ్గారు. గడువు ముగిసే సమయానికి 1158మంది మాత్రమే ఫీజులు చెల్లించారు.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు భారంగా ఉండటంతో పాటు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు, నియోజక వర్గాల వారీగా ప్రజాప్రతినిధులకు మామూళ్లు సమర్పించుకోవాల్సి ఉండటంతో దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా చాలామంది వెనక్కి తగ్గారు. ఇలా రిజిస్ట్రర్‌ చేసుకున్న వారిలో 514మంది ఫీజులు చెల్లించలేదు. వంద కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తే రూ.91 కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి సమకూరింది.

శని, ఆది వారాలలో ఈ వేలం ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ఐదు వరకు అవసరమైన చోట రీ బిడ్డింగ్, లాటరీ నిర్వహిస్తారు. వేలంలో బార్లను దక్కించుకున్న వారి పేర్లను కలెక్టర్లు ఖరారు చేస్తారు. వేలం ఖరారయ్యాక అప్‌సెట్‌ వాల్యూ, బిడ్ మొత్తానికి బ్యాంకు చలానా రూపంలో నగదు జమ చేయాల్సి ఉంటుంది.

ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 2025 వరకు వ్యవధితో మూడేళ్ళ కాలానికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలలో ధరల్ని భారీగా పెంచిన ప్రభుత్వం బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ధరల విషయంలో నియంత్రణ ఎత్తేసింది. గత మూడేళ్లలో బార్లలో విక్రయించే మద్యం ధరలు రెట్టింపు అయ్యాయి. ఎమ్మార్పీలపై 100శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. స్థాయిని బట్టి హోటళ్లలో ధరలు పెరుగుతున్నాయి.

Whats_app_banner