Visakha Gang Rape: విశాఖలో ఒడిశా బాలికపై గ్యాంగ్ రేప్..
Visakha Gang Rape: విశాఖలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతి మోసపోయింది. ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతిపై అతని స్నేహితుడు కూడా అత్యాచారానికి పాల్పడటం, ఆపై మరికొందరు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.
Visakha Gang Rape: విశాఖలో ఒడిశాకు చెందిన దళిత బాలిక దారుణంగా మోసపోయింది. ప్రియుడి చేతిలో వంచనకు గురైన బాలిక ఆ తర్వాత మరో బృందం చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది.
ఒడిశాలోని కలహండి జిల్లా పనిముండ్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం కుటుంబంతో సహా విశాఖ వచ్చాడు. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మాన్‌గా పనిచేస్తూ కంచరపాలెంలో నివసిస్తున్నాడు. అతని 17ఏళ్ల కుమార్తె పోర్టు క్వార్టర్స్ సమీపంలోని నేవీ అధికారి ఇంట్లో పని చేస్తోంది. బాలిక నేవీ ఉద్యోగి ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది.
డిసెంబర్ 17న ఇంటి నుంచి పని కోసం వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో 18వ తేదీన కుటుంబ సభ్యులు విశాఖ ఫోర్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమెను స్వగ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. డిసెంబర్ 22న ఆమెను స్వగ్రామం నుంచి విశాఖ తీసుకొచ్చారు.
తల్లిదండ్రులతో సహా స్వగ్రామానికి వెళ్లి బాలికను విశాఖపట్నం తీసుకువచ్చి అప్పగించారు. అప్పటికీ ఆమె ఏమి జరిగిందో ఎవరికి చెప్పలేదు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు వెళ్లిపోయిన తర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో శనివారం వారు పోలీసులను ఆశ్రయించారు.
ఏం జరిగిందంటే....
బాధిత బాలికను స్థానికంగా ఉండే ఓ ఒడిశా యువకుడు ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. డిసెంబర్ 18న నగరంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిసిన తర్వాత తన మిత్రుడికి ఫోన్ చేసి పిలిపించాడు. హోటల్‌కు వచ్చిన ప్రియుడి స్నేహితుడు బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమించిన వ్యక్తే మోసం చేయడంతో తట్టు కోలేకపోయిన బాలిక తీవ్ర మనస్తాపంతో బీచ్‌కు చేరుకుని విలపిస్తుండటాన్ని అక్కడ ఉండే ఫోటోగ్రాఫర్ గమనించాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్కే బీచ్‌లొో రోదిస్తుండగా.. పర్యాటకుల ఫొటోలు తీసే వ్యక్తి ఆమెను పరిచయం చేసుకున్నాడు.
బాధిత బాలికను ఓదారుస్తున్నట్లు నమ్మించి మొదట తన స్నేహితుల గదికి ఆమెను తీసుకుని వెళ్లిన ఫోటోగ్రాఫర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ అతనితో పాటు మరో మరో ఏడుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని హోటళ్లు, లాడ్జిలకు ఆమెను తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులకు వివరించింది.
సామూహిక అత్యాచారం ఫిర్యాదుపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీచ్‌లో ఆమెను అపహరించిన ప్రధాన నిందితుడితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశించారు.
దిశా పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశించారు. బాలిక మిస్ అయినప్పటి నుంచి స్వగ్రామానికి వెళ్లే వరకు ఏమి జరిగిందనే దానిపై పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన ఎనిమిది మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.