Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు కొత్త రూల్స్.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందే-new rules for jagananna vidyadeevena bank accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు కొత్త రూల్స్.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందే

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు కొత్త రూల్స్.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందే

Sarath chandra.B HT Telugu
Nov 16, 2023 07:38 AM IST

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన లబ్దిదారులకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు విద్యార్ధుల తల్లుల ఖాతాలకు ఫీజులు జమ చేస్తుండగా ఇకపై జాయింట్ అకౌంట్లకు మాత్రమే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జగనన్న విద్యాదీవెన నిబంధనల్లో మార్పులు
జగనన్న విద్యాదీవెన నిబంధనల్లో మార్పులు (twitter)

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన పథకంలో సాంకేతికంగా ఎదురవుతున్నసమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్పుల చెల్లింపును గతంలో నేరుగా కాలేజీలకు రీయింబర్స్ చేసేవారు. ఈ విధానంలో విద్యార్ధులు కాలేజీలకు రాకపోయినా ఫీజుల చెల్లించడం, లేని విద్యార్ధుల పేరుతో లబ్ది పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది.

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్ధులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల్లో ఫీజుల్ని చెల్లిస్తోంది. విద్యార్ధుల తల్లి ఖాతాలకు ఇన్నాళ్లు ఫీజులు జమ చేస్తున్నారు. అయితే ఈ విధానంలో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదరవుతున్నాయి.

ఫీజుల రుసుముల్ని కొన్నిసార్లు వ్యక్తిగత అవసరాలకు వాడేసుకోవడం, సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్ధులు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన డబ్బులు, తల్లుల ఖాతాల్లో పడిన ఫీజుల్ని రకరకాల కారణాలతో కాలేజీలకు చెల్లించడం లేదు.

విద్యార్ధుల తల్లి పేరిట వ్యక్తిగత రుణాలు, స్వయం సహాయక రుణాలు ఉంటే సదరు ఖాతాలో ఫీజుల కోసం చెల్లించిన డబ్బుల్ని బ్యాంకులు వాటికి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఆటో డెబిట్‌ సదుపాయం ఉండటంతో ఫీజు రియింబర్స్‌మెంట్‌ మొత్తాలను కాలేజీలకు చేరకుండా పోతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

జగనన్న విద్యాదీవెన నాలుగో విడత ద్వారా లబ్ధిపొందేందుకు తల్లి, విద్యార్థితో కూడిన నూతన జాయింట్‌ బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీలోగా కొత్త ఖాతాలను తెరవాలని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు.

2022-23 ఆఖరి సంవత్సరం పూర్తయిన అన్ని కేటగిరిల విద్యార్థులు తప్పకుండా జాయింట్ అకౌంట్స్‌ తెరవాలని సూచించారు. విద్యార్థులను ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌గా , తల్లిని సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లి మరణిస్తే.. తండ్రి లేదా సంరక్షకుడు రెండో ఖాతాదారునిగా ఉండాలని వివరించారు.

ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే.. అందరూ కలిసి ఒకే బ్యాంకు ఖాతా తెరవొచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవాల్సిన విద్యార్థిని ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌గా గుర్తించాలని సూచించారు.

రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనైనా జాయింట్‌ ఖాతాలు తెరవొచ్చని కొత్త ఖాతాలకు ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సదుపాయాలు ఉన్న ఖాతాలకు ఏటిఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలని ఆదేశించారు. బ్యాంకు అకౌంట్లకు చెక్‌ బుక్‌కు మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు కూడా ప్రభుత్వం సమాచారం పంపింది.

ప్రభుత్వ పథకాల్లో భాగంగా అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు చెల్లిస్తున్న డబ్బును ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇతర బకాయిలకు మళ్లించుకోవడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో నిబంధనలు మార్పులు చేశారు. ఈనెల 28న విద్యాదీవెన నిధులు జమ చేయనున్న నేపథ్యంలో విద్యార్దుల ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించేలా నిబంధనలు సవరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Whats_app_banner