Red Book Flexies : ఏపీలో తెరపైకి 'రెడ్ బుక్' ఫ్లెక్సీలు - అర్థం మారిందా..?-nara lokesh red book flexies displayed in mangalagiri city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Red Book Flexies : ఏపీలో తెరపైకి 'రెడ్ బుక్' ఫ్లెక్సీలు - అర్థం మారిందా..?

Red Book Flexies : ఏపీలో తెరపైకి 'రెడ్ బుక్' ఫ్లెక్సీలు - అర్థం మారిందా..?

HT Telugu Desk HT Telugu
Jun 07, 2024 03:20 PM IST

Nara Lokesh Red Book Flexies : ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో గతంలో లోకేశ్ చేసిన రెడ్ బుక్ కామెంట్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి.

రెడ్ బుక్ సంచలనం...భారీ ప్లెక్సీలతో హెచ్చరికలు
రెడ్ బుక్ సంచలనం...భారీ ప్లెక్సీలతో హెచ్చరికలు

Nara Lokesh Red Book Flexies : "అధికారంలోకి రాగానే అంతు చూస్తా. ఎవ్వరినీ వదలను. వారందరి పేర్లను బుక్ లో నమోదు చేసుకుంటున్నా" అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో దాదాపు ప్రతి ప్రసంగంలో ఇదే అంశంపై ప్రస్తావించేవారు.‌

ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ కూటమి ఘన విజయం‌ సాధించింది. ప్రభుత్వంలో లోకేష్ మాటకు ప్రాధాన్యత ఉంటుంది.‌ ఆయన మాటకు అడ్డు చెప్పడానికి ఆస్కారం లేదు. ఆయన ఏం చెబితే, అదే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక లోకేష్ ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో చేసిన ప్రకటనలపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇటీవలి ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా లోకేష్ ఈ రెడ్ బుక్ అంశంపై కూడా స్పందించారు. తాను యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రకటనలపై వెనక్కి దగ్గనని స్పష్టం చేశారు. ఈ లోపే మంగళగిరిలో భారీ ప్లెక్సీలు వెలిశాయి. " RED BOOK (రెడ్ బుక్), సిద్ధం" అంటూ హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీపై రెడ్(ఈఆఅ) కు అర్థం వచ్చేలా resilience, empowerment, development అని రాసుకొచ్చారు.

అధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్…!

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో అధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గీత దాటి వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలకు పూనుకున్నారు. దీంతో ఇప్పుడు రెడ్ బుక్ ఏపీలో అధికారుల్లో గుబులు పుట్టిస్తుంది.

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని, వారెవ్వరిని విడిచిపెట్టేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. లోకేష్ దర్యాప్తు అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారని కూడా ఏపీ‌ సీఐడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు.

రెడ్ బుక్ అమలు చేసేందుకు టీడీపీ‌ నేత నారా లోకేష్ కి అవకాశం రావడంతో అధికారులు గుబులు పడుతున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలే చాన్సే లేదని నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. కక్ష సాధింపులు అనేవి తమ‌ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను. కానీ, తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని అన్నారు.

తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు ప్రారంభమైంది.

ఆసక్తి చూపని చంద్రబాబు

ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించడంపై టీడీపీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వారిని క్షమించే ప్రశ్నే లేదని అంటున్నారు. టీడీపీ గెలిచిన తరువాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు నివాసానికి వెళ్లారు. అయితే వారిని కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి అవకాశం వచ్చింది. అయితే ఆయన కేవలం బోకే ఇవ్వడానికే పరిమితం అయ్యారు. అయితే ఆయన తీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించిన సీఐడీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామంజనేలు, కర్నూల్ లో చంద్రబాబును అరెస్టు చేసి‌న సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామి రెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు వారికి అనుమతి ఇవ్వలేదు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా చంద్రబాబు దూరం పెట్టారు. అయితే వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు.

స్కిల్ కేసు సహా తప్పుడు కేసులు పెట్టిన సీఐడీ చీఫ్ లు పీవీ సునీల్ కుమార్, సంజయ్ లపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మంది అధికారులపై ఆరోపణలు టీడీపీ చేస్తుంది.

రిలీవ్ కు అనుమతి నిరాకరణ

రెడ్ బుక్ లో ఉన్న వారిలో డిప్యూటేషన్ అధికారులే లక్ష్యంగా చర్యలు ఉంటాయి. డిప్యూటేషన్ పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వడానికి ప్రభుత్వం అంగీకరించటం లేదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై కేసు పెట్టారు. ఆయన వెళ్లి పోతానంటూ లేఖ రాశారు.

గనులు శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా విజ్ఞాపన పెట్టారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి, ఆర్థక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఏపి నుంచి వెళ్లిపోతామంటూ లేఖలు రాశారు. తెలంగాణకు వెళ్లేందుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. సెలవులపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సెలవులను కూడా తిరస్కరించారు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner