Nara Lokesh: బుధవారం నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న నారా లోకేష్‌-nara lokesh is getting ready for yuvagalam padayatra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh: బుధవారం నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న నారా లోకేష్‌

Nara Lokesh: బుధవారం నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న నారా లోకేష్‌

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 08:52 AM IST

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేష్‌ గత వారమే తిరిగి రావాల్సి ఉన్నా కోర్టు పిటిషన్ల నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు. నేడో రేపో సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందనే ఆలోచనతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. పక్షం రోజులుగా యాత్ర నిలిచిపోవడంతో దాని ప్రభావం పార్టీ మొత్తంపై పడుతోంది. ఓ వైపు చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్‌ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.

yearly horoscope entry point

శుక్రవారం చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణకు వస్తాయని భావిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఖచ్చితంగా ఊరట లభిస్తుందనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. టీడీపీ అధ్యక్షుడు తరపున ప్రముఖ న్యాయనిపుణుడు రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టు సీజే బెంచ్‌ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయం రావొచ్చని టీడీపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు సుప్రీం కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా లోకేష్‌ ప్రజల్లోకి వచ్చేయాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పది రోజులుగా లోకేష్ ఢిల్లీలో ఏమి చేస్తున్నారంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఫైబర్‌ నెట్‌ కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుల్లో అరెస్ట్‌ నుంచి తప్పించుకోడానికి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. దీంతో అనివార్యంగా లోకేష్‌ యాత్రను రీ స్టార్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పది రోజులుగా లోకేష్ పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం, పార్టీని నడిపంచే నాయకత్వంలో లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ యాత్ర నిలిచి పోయిన ప్రాంతం నుంచి తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు…

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు ఆ పార్టీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు 14 మంది సభ్యులను కమిటీలోకి తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

కమిటీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్‌, పయ్యావుల కేశవ్‌, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధనరెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్‌, నారా లోకేశ్‌లు సభ్యులుగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమాల నిర్వహణతో పాటు నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు టీడీపీకి మద్దతిచ్చే రాజకీయ,ఇతర పక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుందని వివరించారు.

Whats_app_banner