Mudragada Name Change: పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటన, ఎన్నికల ముందు ఛాలెంజ్
Mudragada Name Change: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాలు చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ సవాలుకు కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించారు.
Mudragada Name Change: ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు చివర రెడ్డి పెట్టుకుంటానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ ప్రకటించారు. ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభంపై మంగళవారం నుంచి తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. పేరు మార్చుకునేది ఎప్పుడంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించారు. అందుకు అవసరమైన గెజిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశానని, దాంట్లో తాను ఓటమి చెందానని, అన్నమాట ప్రకారం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తన కోసం వచ్చే వారికి ఉప్మాలు పెట్టడంపై జనసేన కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులకు బిర్యానీలు పెట్టాలని సూచించారు.
ఏం జరిగిందంటే…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవిలపై వైసీపీ నేత ముద్రగడ ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఏప్రిల్30న ఎన్నికల పోలింగ్‌కు ముందు ఈ సవాలు చేశారు.
పిఠాపురంలో(Pithapuram) పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్(Hyderabad) నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని పవన్ పై ముద్రగడ సెటైర్లు వేశారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదన్నారు.
పవన్ కల్యాణ్ కు విషయంపై అవగాహన లేకుండా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని రైలు దహనం ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. తనను తీహార్ జైలుకి పంపించాలని హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేశారని, అదంతా చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు.
పవన్ పార్టీ ప్యాకప్
పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ముద్రగడ (మండిపడ్డారు. ఏదైనా పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా తాను సమాధానం చెప్తానన్నారు. రంగువేసుకునే వాళ్లను ప్రజలను నమ్మరని, వారికి ఓట్లు వేయరన్నారు. పవన్ పార్టీ తొందరలోనే ప్యాకప్ చెప్తుతుందని జోస్యం చెప్పారు. పవన్ కు తోటి వారిని గౌరవిడంచడం రాదన్నారు.
పవన్ సినిమాల్లో నటించాలని కానీ, రాజకీయాల్లో కాదన్నారు. పవన్ కల్యాణ్ కు డబ్బే ప్రధానం అన్నారు. రైతులకు సాయం పేరుతో తీసుకున్న చందాల్లో ఎంత మేర ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా ఆదాయం కంటే రాజకీయాల్లో ఆదాయమే పవన్ కు బాగుందన్నారు. నేను చవటను, దద్దమ్మను అయితే కాపులు కోసం పవన్ ఎందుకు రోడ్డుపైకి రాలేదని ప్రశ్నించారు. పవన్ తనపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి మద్దతిచ్చినా ప్రయోజనంలేదు
వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కు ఏ హక్కు ఉందని ముద్రగడ ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. పవన్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టారని అని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని ఎద్దేవా చేశారు. పిఠాపురం(Pithapuram) ప్రజలు పవన్ ను తన్ని తరిమేస్తారని ముద్రగడ ఫైర్ అయ్యారు.
ఉప్మా, కాఫీ అని తనను అవమానిస్తున్నారని, గౌరవించడం తన అలవాటన్నారు. అలా మాట్లాడడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. సినిమా వాళ్లు ఎప్పుడూ ప్రజలను ఆదుకోరని ఆరోపించారు. పవన్ తన ఇంట్లో కనీసం ఎవరికైనా కనీసం కాపీ ఇచ్చారా? అని నిలదీశారు. చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే గౌరవిస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు గురించి చిరంజీవి ఎందుకు మాట్లాడడంలేదన్నారు. అప్పుడు మాట్లాడని చిరంజీవి.. ఇప్పుడు ఏదో వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. 1978లో ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్థోమత లేని చంద్రబాబుకు ఇవాళ ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.