Anantapur : అనంతపురంలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్దల మృతి
Anantapur : అనంతపురంలో విషాదం నెలకొంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తల్లిబిడ్డ మరణించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో విషాదం జరిగింది. బాత్‌రూంకు వెళ్లిన గర్భిణీ అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో.. తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కల్లిమఠంకు చెందిన మంజునాథ్.. తన భార్య సరళా జ్యోతి (30)ని మూడో కాన్ఫునకు గత నెల27న అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.
హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. కానీ ఆ స్థాయిలో పట్టించుకోలేదు. బాత్‌రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్ రూంకు పంపించడంలో స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్‌వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. కుటుంబ సభ్యులే సరళా జ్యోతిని తీసుకెళ్లారు. అక్కడ ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది స్పందించలేదు.
కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది సరళా జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించారు. సీపీఆర్ ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంకాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజునాథ్‌ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని చెప్పారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రైవేట్ మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకుని వెళ్లి వైద్యులు అందజేశాడు.
ఆ తరువాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కూడా మృతి చెందింది. తమకు తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరు మున్నీరుగా విలపించారు.
దీనిపై స్పందించిన గైనిక్ విభాగం హెచ్‌వోడీ షంషాద్‌బేగం.. తల్లిని బతికించాలని చూశామన్నారు. జ్యోతికి రక్షహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించామని చెప్పారు. నెలలు నిండకపోవడంతో పాటు బాత్‌రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయిందన్నారు. అప్పటికే పల్స్ లేదని, తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశామని చెప్పారు. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించారని చెప్పారు. ఈ ఘటనపై విచారిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వివరించారు. సిబ్బంది, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)