Mekapati Goutham Reddy | మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడు ఆయనే.. మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్యను తీసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ సమీకరణాలు మారాయి. గౌతమ్ రెడ్డి వారసుడిపై .. మేకపాటి కుటుంబం క్లారిటీ ఇచ్చింది. ఊహాగానాలు అన్నీ.. తారుమారు అయ్యాయి.
ఏపీ కేబినెట్ లో.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానం ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరుని మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ కీర్తి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికి తెరదించుతూ.. కుటుంబ సభ్యుల చర్చల్లో విక్రమ్ రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించారు.
మేకపాటి రాజ మోహన్ రెడ్డి రెండో కుమారుడైన విక్రమ్ రెడ్డి ఊటీ గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎంఎస్ పూర్తి చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డిని పోటీలోకి దింపాలనే నిర్ణయాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి మేకపాటి కుటుంబం తీసుకు వెళ్లింది. మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి.. సొంత అంతర్జాతీయ సంస్థ 'కేఎంసీ'కి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు విక్రమ్.
విక్రమ్ రెడ్డి గురించి.. మేకపాటి కుటుంబం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయనకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అని విషయంపై అందరి దృష్టి ఉంది. గౌతమ్ రెడ్డి.. తుది శ్వాస వరకూ.. రాష్ట్రం కోసం ఎంతగానో పని చేశారు. దుబాయ్ లో ఏపీ ప్రభుత్వం తరపున పెవిలియన్ ఏర్పాటు చేసి దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. అయితే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తర్వాతి రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత.. గౌతమ్ రెడ్డి భార్య రాజకీయాల్లోకి వస్తారు అనుకున్నారు. కానీ ఆయన సోదరుడు.. విక్రమ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
టాపిక్