Ration Rice Issue: ఆగని రేషన్ బియ్యం అక్రమాలు.. ఊరురా యథేచ్ఛగా అమ్మకాలు, విశాఖ పోర్టులో 483టన్నుల బియ్యం స్వాధీనం
Ration Rice Issue: కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనుకున్నా అలా ఎక్కడా జరగలేదు.రేషన్ సిండికేట్లు చేతులు మారడం తప్ప పెద్ద మార్పేమి కనిపించడం లేదు.ఎండియూల నుంచే నేరుగా బియ్యం మిల్లర్లకు రీ సైక్లింగ్‌కు వెళ్తోంది.
Ration Rice Issue: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనుకున్నా అలా ఎక్కడా జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. మొబైల్ డెలివరీ యూనిట్ల దగ్గర మొదలయ్యే కొనుగోలు ప్రక్రియ చివరకు పోర్టుల వద్దకు చేరుతోంది. తాజాగా విశాఖపట్నం పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల చేపట్టిన తనిఖీల్లో 483 టన్నుల బియ్యం పట్టుబడింది.

రేషన్ మాఫియా మూలాల్లో పరిష్కారం వెతక్కుండా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కొద్ది రోజుల క్రితం రేషన్ బియ్యం అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో సృష్టించిన అలజడి తర్వాత ఈ దందా జోరు తగ్గుతుందని అంతా భావించారు. పవన్ ఎపిసోడ్ తర్వాత బియ్యం మాఫియా గ్రామాల్లో బహిరంగంగానే కొనుగోళ్లు చేపడుతున్నాయి. గతంలో తనిఖీలు, దాడులకు భయపడాల్సి వచ్చేదని ఇప్పుడు అందరికి తెలిసి పోవడంతో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
రేషన్ దుకాణాల నుంచి వాహనాల ద్వారా ప్రజలకు చేరాల్సిన బియ్యం అటు నుంచి అటే మాఫియా గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమ సేకరణ కోసం విస్తృత నెట్‌వర్క్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాత సిండికేట్ల స్థానంలో కొత్తవి పుట్టుకొచ్చాయి. రూ.10కు కొనుగోలు చేసే బియ్యానికి ఎగుమతి చేసే దశకు చేరే సరికి రూ.40వరకు ధర పలుకుతోంది. కిలోకు రూ.30రుపాయల లాభం కనిపిస్తుండటంతో గ్రామం నుంచి మండలం, జిల్లా స్థాయిలకు సిండికేట్లు ఏర్పడ్డాయి.
విశాఖ పోర్టులో భారీగా నిల్వలు…
సోమవారం విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్దం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం పోర్డు పరిధిలో ఉన్న కంటైనర్ ఫైట్ స్టేషన్‌కు చెందిన నాలుగు గోడౌన్లలో తనిఖీ చేశారు. మొదటి మూడు గోదాముల్లో 190 టన్నులు బియ్యం ఉండగా, గోదాముల నుంచి పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు 10 కంటైనర్లల్లో మరో 299 టన్నుల బియ్యం సిద్ధం చేసినట్టు గుర్తిం చారు.
మంత్రితో పాటు ఉన్న అధికారులు బస్తాల నుంచి బియ్యం తీసుకుని పరిశీ లించారు. రెండు గోదాములు, కంటైనర్లలో ఉన్న బియ్యంలో కెర్నల్స్ ఉన్నట్టు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. రేషన్ కార్డుదారులకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్లో కెర్నల్స్ ఉంటాయి. తనిఖీలలో లభ్యమైన వాటిని రేషన్ బియ్యంగా నిర్ధారించి 483 టన్నులు సీజ్ చేశారు.
బియ్యంలో శాంపిల్స్ తీసుకుని పౌరసరఫరాల సంస్థకు చెందిన ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపారు.విశాఖ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు పక్కా సమాచారం రావడంతో నాలుగు బృందాలు తనిఖీ చేశాయన్నారు. రెగ్యులర్ బియ్యం, ఇతర సరుకులతో పాటు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ గోదాముల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. రాయ్‌పూర్‌కు చెందిన ఏజీఎస్ వుడ్స్ అనే సంస్థ బియ్యం ఎగుమతి చేస్తోందన్నారు.
కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో వ్యాపారులు 2నెలల నుంచి విశాఖ పోర్టు నుంచి 70వేల టన్నుల బియ్యం ఎగు మతి చేశారని మంత్రి నాదెండ్ల వివరించారు. వాటి విలువ సుమారు రూ.25 వేల కోట్లు ఉంటుందన్నారు. రేషన్ బియ్యం రూ.43కు కొనుగోలు చేసి కార్డు దారులకు అందజేస్తుందని, వారి నుంచి కిలో రూ.10కు తీసుకుంటున్నారన్నారు. తరువాత వీటిని పాలిష్ చేసి కిలో రూ.70 నుంచి రూ.80కు విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. విశా ఖలో సీజ్ చేసిన బియ్యం రవాణా వ్యవహారాన్ని సిట్‌కు నివేదించనున్నట్టుతెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.