Ambati Rayudu : పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ, జనసేనలో చేరతారా?-mangalagiri news in telugu cricketer ambati rayudu meets janasena chief pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambati Rayudu : పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ, జనసేనలో చేరతారా?

Ambati Rayudu : పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ, జనసేనలో చేరతారా?

Bandaru Satyaprasad HT Telugu
Jan 10, 2024 02:25 PM IST

Ambati Rayudu : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు, పవన్ తో భేటీ అవ్వడంతో ఆసక్తి నెలకొంది.

అంబటి రాయుడు, పవన్ కల్యాణ్
అంబటి రాయుడు, పవన్ కల్యాణ్

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్, అంబటి రాయుడు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు, 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడారు. పవన్ తో అంబటి రాయుడు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? జనసేనలో చేరుతున్నారా? అనే విషయంపై ఆసక్తినెలకొంది.

వైసీపీకి రాజీనామా

గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి రాయుడు వైసీపీలో చేరారని, కానీ సీఎం జగన్ ఈ సీటు వేరే వాళ్లకు ఇవ్వడంతో వైసీపీకి రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. డిసెంబర్ 28న అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కొన్ని రోజులకే రాజీనామా చేశారు. అనంతరం రాజీనామాపై స్పందిస్తూ... ట్వీట్ చేశారు. దుబాయ్‌లో జరిగే ఐఎల్‌ టీ20 టోర్నీలో ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతున్నానని తెలిపారు. ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు, పార్టీలతో సంబంధం ఉండకూడదు కాబట్టే వైసీపీకి రాజీనామా చేశానన్నారు. కానీ అనూహ్యంగా పవన్ తో రాయుడు భేటీ అవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జనసేనకు ప్లస్

అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆయన జనసేనలో చేరితో పార్టీకి లాభం చేరుకుందని జనసైనికులు భావిస్తున్నారు. రాయుడు జనసేనలో చేరితో మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాయుడు...సీటు హామీ దక్కితే జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

గుంటూరు సీటు కోసం ప్రయత్నాలు!

గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన అంబటి రాయుడు...సీజన్ ముగియగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఏపీ రాజకీయాల్లో కొన్నాళ్ల పాటు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అంబటి రాయుడు... ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు మద్దతుగా వ్యవహరించారు. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ మ్యాచుల్లో క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడంపై అంబటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. క్రీడాకారులు బలంగా కొట్టడంతో బ్యాట్లు విరిగిపోయాయన్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ తప్పనిసరి అని భావించిన రాయుడు... పది రోజుల క్రితం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే రాజీనామా అంటూ బాంబ్ పేల్చారు. అయితే రాయుడు ఆశించిన గుంటూరు ఎంపీ సీటు దక్కదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner