Janasena: కుల రాజకీయాలపై పవన్‌ కళ్యాణ‌్ ఫుల్‌ క్లారిటీ.....-janasena chief pawankalyan trying for kapu vote bank solidarity ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena: కుల రాజకీయాలపై పవన్‌ కళ్యాణ‌్ ఫుల్‌ క్లారిటీ.....

Janasena: కుల రాజకీయాలపై పవన్‌ కళ్యాణ‌్ ఫుల్‌ క్లారిటీ.....

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 10:00 AM IST

Janasena: పవన్‌ కళ్యాణ్‌ పూర్తి క్లారిటీకి వచ్చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మొత్తం రెండు సామాజిక వర్గాల మధ్య అధికార పంపిణీ కార్యక్రమమని నిర్ధారించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు ఏ పార్టీ చేయని కొత్త ప్రయోగానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి వర్గాల మధ్య సాగుతున్న కుల రాజకీయాల్లో కాపుల అస్తిత్వాన్ని వెదుక్కోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టే బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నారు.

కాపు కుల ఐక్యతపై పవన్ కళ్యాణ్ కామెంట్స్‌
కాపు కుల ఐక్యతపై పవన్ కళ్యాణ్ కామెంట్స్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రధానంగా కులాల చుట్టే తిరుగుతాయి. 80లలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఆ తర్వాత కమ్మ, రెడ్ల మధ్య అధికార పంపిణీగా మారింది. రాష్ట్రం విడిపోయిన పదేళ్ళ్ల తర్వాత ఏపీలో కాపులకు రాజకీయ అస్తిత్వాన్ని వెదికే బాధ్యత పవన్ కళ్యాణ్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ రాజకీయ శత్రువుగా వైఎస్సార్సీపీని ప్రకటించినా అదే సమయంలో కాపుల్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, రెడ్డి తర్వాత ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న కాపులతో పాటు ఉప కులాలను ఒక్కటి చేయాలని సుదీర్ఘ కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి పెద్దగా ఫలించలేదు. 2009లో ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి ఓ ప్రయత్నం చేసినా అది ఆశించిన ఫలితాలనివ్వలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీని విలీనం చేస్తాననే మాట లేకుండా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో కులాభిమానం చూపాల్సిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పార్టీలు ముసుగులో కుల రాజకీయాలు చేయడం మామూలే అయినా పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకోచం లేకుండా కుల ప్రస్తావన చేస్తున్నారు. పదే పదే కులాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీపై దూకుడుగా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌ కాపుల్ని కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకరి పల్లకి మోయడానికి సొంత కులాన్ని తిడుతున్నారని ఆరోపించారు. తాను కులాల ఐక్యత మీద బలంగా మాట్లాడే వ్యక్తినని, రాష్ట్రంలో ఆంధ్ర భావన లేదని తమ సొంత కులాన్ని తిడుతూ, వేరే వ్యక్తి ప్రాపకం కోసం పాకులాడుతున్నారని పవన్ ఆరోపించారు. ఒక్కడి కోసం తమ సొంత కులాలను కూడా తిడుతున్నారని , తెలంగాణలో గుర్తింపుకు నోచుకొని 18 బీసీ కులాల పరిస్థితి మీద ఎవరు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. నాయకుడు అంటే అన్ని కులాలను కలుపుకొని వెళ్లేవాడని, కొన్ని కులాలను వర్గ శత్రువులుగా ప్రకటించేవాడు కాదన్నారు.

ఏపీ ప్రజల్లో ఆంధ్రా భావం ఎలాగూ లేదని కనీసం కుల భావనతో అయినా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కులం కావాలని, గెలిచిన తర్వాత కులం అవసరం లేదనన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని, వైసీపీ పాలన ఎమర్జెన్సీని మించిపోయిందని ఆరోపించారు. మొత్తమ్మీద పవన్‌ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కాపులతో పాటు ఉపకులాలను తన వైపుకు తిప్పుకోవడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

IPL_Entry_Point

టాపిక్