Ysrcp Calculations: నాలుగు జాబితాలు… ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజక వర్గాల్లోనే భారీ మార్పులు
Ysrcp Calculations: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు జాబితాలను ప్రకటించారు.
Ysrcp Calculations: గెలుపే లక్ష్యంగా వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు నాలుగు జాబితాలను ప్రకటించారు. వీటిలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను ఆ పార్టీ ప్రకటిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం సీట్లు నిరాకరిస్తూ కొత్తవారికి చోటు కల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థాన చలనం కల్పిస్తున్నారు. నాలుగు జాబితాల్లో కలిపి 58 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని ఆ పార్టీ మార్చేసింది. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలే ఉన్నాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుల్ని పదిలం చేసుకునే వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. 2014, 2019 ఎన్నికలతో పాటు 2010-14మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన వారికి కూడా ఈ సారి స్థాన చలనం తప్పడం లేదు. సర్వే నివేదికలు, సామాజిక సమీకరణల నేపథ్యంలోనే మార్పులు జరుగుతున్నాయని వైసీపీ చెబుతోంది.
తొలి జాబితాలో…
డిసెంబర్ 11న విడుదల చేసిన జాబితాలో 11 సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో ప్రత్తిపాడు ఎస్సీ నియోజక వర్గానికి బాలసాని కిరణ్‌కుమార్, కొండేపిలో ఆదిమూలపు సురేష్, వేమూరులో వరికూటి అశోక్‌బాబు, తాడికొండలో మేకతోటి సుచరిత, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున ఉన్నారు. ఇవన్నీ ఎస్సీ రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి. మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు.
మిగిలిన వాటిలో చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమలో విడదల రజిని, అద్దంకిలో పాణెం హనిమిరెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి, రేపల్లెలో ఈపూరు గణేష్, గాజువాకలో వరికూటి రామచంద్రరావులు ఉన్నారు.
రెండో జాబితాలో…..
జనవరి 2వ తేదీన విడుదల చేసిన జాబితాలో పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చేశారు. వీటిలో అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీగా జోలదరాశి శాంత, ఎస్టీ రిజర్వుడు స్థానమైన అరకులో కొళ్లగుళ్లి భాగ్యలక్ష్మీలను సమన్వయకర్తలుగా నియమించారు.
అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వుడు స్థానంలో తాలె రాజేష్, పాయకారావుపేట(ఎస్సీ)లో కంబాల జోగులు, పి.గన్నవరంలో విప్తర్తి వేణుగోపాల్, పోలవరం(ఎస్టీ) తెల్లం రాజ్యలక్ష్మీ, ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్, అరకులో(ఎస్టీ) గొడ్డేటి మాధవి, పాడేరు(ఎస్టీ)లో మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఉన్నారు.
రెండో జాబితాలో అనకాపల్లిలో మలసాల భరత్‌కుమార్, రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్, పిఠాపురంలో వంగాగీత, జగ్గంపేటలో తోట నరసింహం, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీలో మార్గాని భరత్, రాజమండ్రి రూరల్‌లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కదిరిలో బి.ఎస్.మక్బూల్ అహ్మద్, ఎమ్మిగనూరులో మాచాని వెంకటేష్, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్‌లో షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండలో కె.వి.ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, విజయవాడ సెంట్రల్‌లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్‌లో షేక్ ఆసిఫ్ ఉన్నారు.
మూడో జాబితాలో…
జనవరి 11న ప్రకటించిన మూడో జాబితాలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మీ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీగా కేశినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం పేర్లను ప్రకటించారు.
రిజర్వుడు స్థానాల్లో పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబును తప్పించి మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. చింతలపూడిలో కంభం విజయరాజు, కోడుమూరులో డాక్టర్ సతీష్, గూడూరులో మేరిగ మురళి, సత్యవేడులో మద్దిల గురుమూర్తిలను ఖరారు చేశారు.
ఇచ్చాపురం సమన్వయకర్తగా పిరియ విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చిత్తూరులో విజయానందరెడ్డి, మదనపల్లెలో నిస్సార్ అహ్మద్, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, ఆలూరులో బూసినే విరూపాక్షి, పెనమలూరులో జోగి రమేష్, పెడనలో ఉప్పాల రాములను సమన్వయకర్తలుగా నియమించారు.
నాలుగో జాబితాలో
నాలుగో జాబితాలో ఏకంగా ఎనిమిది చోట్ల ఎస్సీ అభ్యర్థుల పేర్లు మారిపోయాయి. చిత్తూరు ఎంపీ నారాయణ స్వామిని ఖరారు చేశారు. గంగాధర నెల్లూరులో ఎన్.రెడ్డప్పను, శింగనమలలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఎం.వీరాంజనేయులు, నందికొట్కూరులో డాక్టర్ దారా సుదీర్, తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు, మడకశిరలో ఈర లక్కప్ప, కొవ్వూరులో తలారి వెంకట్రావు, గోపాలపురంలో తానేటి వనిత, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్‌లను ఖరారు చేశారు.
నాలుగో జాబితాలో 9 స్థానాల్లో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. అభ్యర్థుల మార్పులు జరిగిన నియోజక వర్గాల్లో రిజర్వుడు స్థానాల్లో స్థాన చలనం కల్పిస్తే, ఓసీలు ఉన్న చోట సిట్టింగుల వారసులకు చోటు కల్పించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనే రకరకాల కారణాలతో అభ్యర్థుల్ని మార్చేయడమో, సీటు నిరాకరించడమో జరిగింది. ఇంకెంత మందికి ఉద్వాసన, స్థాన చలనం జరుగుతుందో వేచి చూడాలి.