YS Sharmila : కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభ్యంతరం లేదు- వైఎస్ షర్మిల-idupulapaya news in telugu ys sharmila says no objection to join congress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభ్యంతరం లేదు- వైఎస్ షర్మిల

YS Sharmila : కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభ్యంతరం లేదు- వైఎస్ షర్మిల

Bandaru Satyaprasad HT Telugu
Jan 02, 2024 08:15 PM IST

YS Sharmila : కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరం లేదని వైఎస్ షర్మిల ప్రకటించారు. రేపు దిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్నారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా కడప జిల్లా ఇడుపుల పాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ... డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. వైఎస్సార్ తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్టీపీ చాలా పెద్ద పాత్ర పోషించిందన్నారు. 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారన్నారు. దీనికి కారణం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమేనన్నారు.

కాంగ్రెస్ అతి పెద్ద సెక్యులర్ పార్టీ

"వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ త్యాగానికి విలువ కూడా ఉంది. మా త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే రేపు దిల్లీకి వెళ్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది."- వైఎస్ షర్మిల

Whats_app_banner