Thimmamma Marimanu : ఈ చెట్టు మీద పక్షులు మలవిసర్జన చేయవట
Thimmamma Marimanu : ప్రపంచంలో కొన్ని విశేషాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే.. కేవలం తరతరాలుగా ముందు తరాలకు వచ్చిన కథలే చెబుతాయి. అలా తరతరాలుగా చెప్పుకొంటూ వస్తున్న వింతల్లో ఒకటి తిమ్మమ్మ మర్రిమాను. వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ మర్రిచెట్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో గూటిబయలు గ్రామం ఉంది. ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాను ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన మర్రి చెట్టు ఇది. సుమారు 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అనే మహిళ పేరు పెట్టారు. దీని వెనక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది.
బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు తిమ్మమాంబ అనే కుమార్తె ఉండేదట. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో తిమ్మమాంబకు పెళ్లి చేశారు. చాలా ఏళ్లు సంసార జీవితం హాయిగా సాగింది. కొంతకాలం తర్వాత.. వీరయ్య మృతి చెందాడు. అప్పుడు సతీసహగమనం ఆచారం ఉండేది. భర్తమరణంతో తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను నాటారు.
అందులో ఈశాన్య దిశలో నాటిన మర్రి గుంజ చిగురించింది. మహావటవృక్షంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ చెట్టుకు తిమ్మమ్మ మర్రిమాను అంటుంటారు. 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి ఈ చెట్టు కోసం ఎంతో కృషిచేశారు. దాంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. మర్రిచెట్టుకు సుమారు 660 సంవత్సరాలకంటే ఎక్కువే వయసు ఉంటుంది.
ఈ చెట్టు కింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి కూడా ఉంటుంది. తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434లో సతీ సహగమనం చేసింది. అని శిలా ఫలకం మీద కనిపిస్తుంది. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతుంటారు. శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టుపై ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెబుతుంటారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే.. పక్షులేవీ ఈ వృక్షంపై ఉండవట..!
పర్యాటకుల కోసం ఈ ప్రాంతంలో విశ్రాంతి కుటీరాలు, భవనాలు ఉన్నాయి. తిమ్మమాంబ ఘాట్‌లో నిర్మించిన గదులు పర్యాటకులను నచ్చుతాయి. గిన్నిస్ బుక్ స్థానం సంపాదించిన తిమ్మమ్మ మర్రిమానును పర్యాటక కేంద్రంగా యాత్రికులు సందర్శిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా చూసేందుకు వస్తుంటారు.