VC Appointments: ఏపీలో యూనివర్శిటీ వీసీ నియామకాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల
VC Appointments: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్టు లోకేష్ ప్రకటించారు.
VC Appointments: ఆంధ్రప్రదేశ్‌లో గత 5ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు వెల్లడించారు.
పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి వీసీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 28ను ప్రకటించారు.
వీసీ నియామకాలకు సంబంధించి ఉన్నత విద్యామండలి జారీ చేసిన నోటిఫికేషన్ లింకు…
17 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం..
1. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
2 శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
3 .ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, గుంటూరు
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ, అనంతపురం
5. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి
6. యోగి వేమన యూనివర్శిటీ, కడప
7. కృష్ణా యూనివర్శిటీ, మచిలీపట్నం
8. రాయలసీమ యూనివర్శిటీ, కర్నూలు
9. విక్రమ సింహపురి యూనివర్శిటీ, నెల్లూరు
10. JNTU కాకినాడ
11. JNTU అనంతపురం
12. JNTU విజయనగరం
13. పద్మావతి మహిళా యూనివర్శిటీ, తిరుపతి
14. ద్రవిడ యూనివర్శిటీ, కుప్పం
15. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం. కర్నూలు
16. డాక్టర్ వైఎస్సార్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, కడప
17. ఆంధ్రకేసరి యూనివర్శిటీ,కడప
వీసీల నియామకం ఎంపిక ప్రక్రియ పబ్లిక్ నోటిఫికేషన్ మరియు టాలెంట్ సెర్చ్ ద్వారా జరుగుతుంది. వైస్-ఛాన్సలర్ నియామకం 3 సంవత్సరాల కాలానికి పదవీకాల ప్రాతిపదికన చేపడతారు. UGC నియమనిబంధనల మేరకు అర్హత కలిగిన వారిని వీసీలుగా నియమిస్తారు. ది.
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 20 రోజులలోపు అన్ని అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి https://apsche.ap.gov.in/
అత్యున్నత స్థాయి అర్హతలతో పాటు విశ్వవిద్యాలయ వ్యవస్థలో ప్రొఫెసర్‌గా UGC నిబంధనల ప్రకారం కనీసం 10 సంవత్సరాల ప్రొఫెసర్‌గా అనుభవం లేదా సమానమైన హోదాలో అనుభవం, విశిష్ట విద్యా రికార్డు కలిగిన వ్యక్తులు, పరిశోధన రంగం అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్‌లో ప్రతిభ ప్రదర్శించినట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వేర్వేరు యూనివర్శిటీల వీసీ పదవుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో యూనివర్శిటీ దరఖాస్తుకు రూ.1000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇమెయిల్, హార్డ్ కాపీలను అనుమతించరు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని వాటిని పరిగణలోకి తీసుకోరు. ఇతర నియమ నిబంధనలు నోటిఫికేషన్ డాక్యుమెంట్‌లో అందుబాటులో ఉన్నాయి.