Srisailam Project : భారీగా కొనసాగుతున్న వరద - మళ్లీ శ్రీశైలం గేట్లు ఎత్తారు-heavy flood water inflow to srisailam project gates again lifted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Project : భారీగా కొనసాగుతున్న వరద - మళ్లీ శ్రీశైలం గేట్లు ఎత్తారు

Srisailam Project : భారీగా కొనసాగుతున్న వరద - మళ్లీ శ్రీశైలం గేట్లు ఎత్తారు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 28, 2024 03:10 PM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు మరోసారి గేట్లు పైకి ఎత్తారు. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

శ్రీశైలం ప్రాజెక్ట్
శ్రీశైలం ప్రాజెక్ట్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో అధికారులు మరోసారి గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ 3 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 1,02,904గా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం883.4గా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 215.81గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది.

సాగర్ లో పరిస్థితి ఇలా….

మరోవైపు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఉదయం 9:35 గంటల రిపోర్ట్ ప్రకారం…. నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… పూర్తిస్థాయిలో నిండుకుండలా ఉంది. ఇక ఇన్ ఫ్లో 78,773 క్యూసెకులుగా నమోదు కాగా… 78,773 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే(బుధవారం మధ్యాహ్నం 1:05 PM రిపోర్ట్)…. ప్రస్తుతం 174 అడుగుల నీటిమట్టం ఉంది.45.77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 59,715 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 57,838 క్యూసెక్కులుగా ఉంది.

లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు:

ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలతో.. ప్రస్తుతం కృష్ణా నది జలకళ సంతరించుకుంది. నదికి ఇరు వైపులా పచ్చదనాన్ని పరచుకున్న నల్లమల అడవులు కనువిందు చేస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమశిల నుంచి శ్రీశైలం వరకు 90 కిలో మీటర్ల లాంచీ ప్రయాణం టూరిస్టులకు మధురానుభూతిని మిగల్చనుంది. కొల్లాపూర్‌ మండలం సోమశిల దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మినీ లాంచీతో జాలీ ట్రిప్‌ నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు.

అధికారులు ప్రారంభించబోయే లాంచీ ప్రయాణం.. నల్లమల అడవుల గుండా వెళ్తుంది. దీంతో టూరిస్టులకు నల్లమల అందాలను ఆస్వాదించే అదృష్టం కలగనుంది. ఈ లాంచీ ప్ర‌యాణంలో మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న దీవులు ఆకట్టుకుంటాయి. నల్లమల అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగే కృష్ణమ్మ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దట్టమైన అడవులు, అక్కడక్కడ సందడి చేసే వన్య ప్రాణులను చూడటం మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని అనుభూతినిస్తుంది.

మరోవైపు శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం కూడా ప్రత్యేక ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. అతి తక్కువ ధరలోనే వెళ్లి రావొచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మలన్న దర్శనంతో పాటు డ్యామ్, రోప్ వే వంటివి చూడొచ్చు.