Srisailam Boat Tour: కృష్ణా జలాలపై 90 కిలోమీటర్లు.. మధురానుభూతినిచ్చే లాంచీ ప్రయాణం
Srisailam Boat Tour: కృష్ణా జలాలపై ఊయలలూగుతూ.. ఎత్తయిన కొండలు.. అరుదైన వన్యప్రాణులు.. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ సాగే పడవ ప్రయాణం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకూ సాగే లాంచీ ప్రయాణం.. ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలతో.. ప్రస్తుతం కృష్ణా నది జలకళ సంతరించుకుంది. నదికి ఇరు వైపులా పచ్చదనాన్ని పరచుకున్న నల్లమల అడవులు కనువిందు చేస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు 90 కిలో మీటర్ల లాంచీ ప్రయాణం టూరిస్టులకు మధురానుభూతిని మిగల్చనుంది. కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మినీ లాంచీతో జాలీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు.
అధికారులు ప్రారంభించబోయే లాంచీ ప్రయాణం.. నల్లమల అడవుల గుండా వెళ్తుంది. దీంతో టూరిస్టులకు నల్లమల అందాలను ఆస్వాదించే అదృష్టం కలగనుంది. ఈ లాంచీ ప్రయాణంలో మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న దీవులు ఆకట్టుకుంటాయి. నల్లమల అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగే కృష్ణమ్మ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దట్టమైన అడవులు, అక్కడక్కడ సందడి చేసే వన్య ప్రాణులను చూడటం మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని అనుభూతినిస్తుంది.