Tirumala Updates : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - నిండిపోయిన క్యూలైన్లు, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్స్ కావటంతో శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతోంది.
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం కూడా సెలవు కావటంతో… మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.
భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట వరకు ఉన్న క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు . సర్వ దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.300 స్పెషల్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.
శనివారం తిరుమల శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,234 మంది తలనీలాలను సమర్పించారు. రూ. 4.09 కోట్లు హుండీ కానుకలు వచ్చాయి. నందకం గెస్ట్ హౌస్ అవతలి వరకు భక్తులు వేచి ఉన్నారని టీటీడీ పేర్కొంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం వరకు పడుతోందని తెలిపింది.
జూన్ 30 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు….
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు(శుక్ర, శని, ఆదివారం తేదీలు)వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది.
శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 - 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే...బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.
జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.
అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశారు.