Tiruchanur goddess padmavati: తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి పౌరాణిక కథ ఏమిటి?-what is the mythological story of goddess padmavati of tiruchanur in tirupati ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tiruchanur Goddess Padmavati: తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి పౌరాణిక కథ ఏమిటి?

Tiruchanur goddess padmavati: తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి పౌరాణిక కథ ఏమిటి?

HT Telugu Desk HT Telugu
May 21, 2024 06:00 PM IST

Tiruchanur goddess padmavati: తిరుపతిలో కొలువైన తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఎలా ఉద్భవించారు? దీని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏంటి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.

తిరుచానూరు పద్మావతి ఆలయం
తిరుచానూరు పద్మావతి ఆలయం

తిరుచాన అనగా శ్రీకాంత. సిరుల తల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని అర్ధము. ఆ జగన్మాత కొలువై ఉన్న ఊరే "తిరుచాన ఊరు” .అదే తిరుచానూరుగా మారిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం శ్రీశుకుని ఊరుగా పిలువబడిందనీ, అదే కాలక్రమంగా శ్రీశుకనూరు అనీ, తిరుచ్చుకనూరు అనీ, తిరుచానూరు అని పిలువబడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీశుకమహర్షి వంటి మహర్షులెందరో తపస్సులు చేశారనీ, ఆ పక్కనే శుకమహర్షి తాత అయిన పరాశరుని తపోభూమి యోగిమల్లవరం (జోగిమమల్లవరం) కూడ ఉందని చెబుతారు.

అలమేలు మంగ ఆవిర్భావం

ఇక్కడి పద్మసరోవర తీరాన సాక్షాత్తు వైకుంఠనాధుడైన శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సాధన చేశాడనీ తత్ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మసరోవరంలో సహస్ర దళాలు కలిగిన పద్మంలో అలమేలుమంగగా, పద్మావతిగా ఆవిర్భవించిందనీ పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన కథనాలు విన్నప్పుడు, ఆ స్థలాలను చూసినప్పుడు పై వాదనలన్నీ పరమసత్యమే అన్న రూఢితోపాటు ఆనందం కూడ కలుగుతుంది.

భృగుమహర్షి పరీక్ష వల్ల, శ్రీ వైకుంఠం నుంచి అలిగి భువికి దిగి వచ్చి కొల్హాప్రుర క్షేత్రం మహారాష్ట్రంలో కొలువై ఉన్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తపస్సుచేసి ప్రార్థించినాడు. ఆ స్వామి వారి కోరిక మేరకు, ఇక్కడి స్వర్ణముఖరీ నదీ తీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతాన పద్మసరోవరంలో అలమేలుమంగగా ఆవిర్భవించింది. అలమేలుమంగ అనగా పద్మంపైన ప్రకాశించే దివ్యవనిత,శ్రీకాంత అని అర్థం. అందువల్లే “పద్మావతి” అని మరో పేరు కూడ ఆ తల్లికి సార్థకమయ్యింది.

అలమేలుమంగగా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వేంకటేశ్వరుడు తన వక్ష్మస్థలంపైన వ్యూహలక్ష్మిగా నిలుపుకొని వేంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్లాడు. అలమేలు మంగమ్మ కొలువై ఆరాధింపబడుతున్నందు వల్ల తిరుచానూరు శ్రీ క్షేత్రం అలమేలుమంగపట్నంగా కూడ ప్రసిద్ధి కెక్కిందని చిలకమర్తి తెలిపారు.

ఇంచుమించుగా ఇదే సమయంలో నారాయణవరం చక్రవర్తి అయిన అకాశరాజు కూతురు పద్మావతిని వేంకటేశ్వరుడు వివాహం చేసుకున్నట్లు, ఆ వివాహానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వేంచేసినట్లు కూడ స్పష్టమవుతుంది. ఆకాశరాజ పుత్రిక పద్మావతి ఎవరు? అన్న సందేహానికి సమాధానంగా త్రేతాయుగం నాటి రామాయణ గాధను స్మరిస్తే సరిపోతుంది. శ్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతాలక్ష్మికి బదులుగా లంకలో వేదవతి (వేదలక్షి) రావణుని చెరలో ఉండింది.

రావణవధానంతరం సీతాదేవి, తనకు బదులుగా లంకలో అవస్థలు పడిన వేదవతిని వివాహమాడవలసిందని శ్రీరాముడిని ప్రార్థించింది. అప్పుడు శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడనైనందున ప్రస్తుతం అది సాధ్యం కాదనీ, కలియుగంలో ఈ వేదవతి ఆకాశరాజు గారాలపట్టి పద్మావతిగా అయోనిజయై జన్మిస్తుందనీ, అదే సమయంలో తాను శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడగలనని వరమిచ్చినాడు. అలాగే ఆచరించినాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చగక్రవర్తి శర్మ తెలిపారు.

వైకుంఠం వా పరిత్యక్ష్యే నభర్తాం స్యక్తు ముత్సహే

మేతి ప్రియాహి మద్భర్తా ఇతి సంకల్పవాసి

నేను వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను, గాని నా భక్తులను మాత్రం ఒక్క క్షణమయినా విడిచి ఉండలేనన్న దృఢసంకల్పంతో వైకుంఠం నుంచి దిగివచ్చి భూలోక వైకుంఠమయిన వేంకటాచలంలో స్వామివారు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. కాని అప్పటి నుంచి ఆ స్వామివారు స్థిరంగా ఉండలేక పైన పేర్కొన్న అనేక సందర్భాల్లోను శ్రీ మహాలక్ష్మిచేత ఆకర్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఆర్తిగా లక్ష్మి వెంటపడినాడు. భూమహాలక్ష్మి (భూదేవి) కోసం విచిత్రమైన వరాహ అవతారాన్ని ధరించినాడు. ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన వేదలక్ష్మి కోసం పరంధాముడు పరిపరివిధాల పరితపించినాడు. ఆమెను మోహించి వివాహం చేసుకున్నాడు.

వేంకటాచలపతి కొల్పాపురంలో మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరాటపడి పదేండ్లపాటు పడరాని పాట్లు పడుతూ తపస్సు చేశాడు. వృథా ప్రయాస మాత్రమే మిగిలింది. అయినా ఏ మాత్రం పట్టువీడని స్వామివారు ఆకాశవాణి ఆదేశం మేరకు పద్మసరోవర తీరాన ఆ మహాలక్ష్మి కరుణ కోసం కన్నులు కాయలు కాసేట్లుగా నిరీక్షిస్తూ పన్నెండేండ్ల పాటు తీవ్రంగా తపస్సు చేశాడు. చివరకు ఆమె కరుణించి పద్మసరోవరంలో బంగారు పద్మంలో అలమేలుమంగ గా ఆవిర్భవించగా ఆ స్వామి ఆమెను వ్యూహలక్ష్మిగా తన గుండెల మీద పదిలపరచుకొన్నాడు.

ఆనాటి నుంచి వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు అనే సార్థక నామధేయంతో వరలినాడు. వలసినన్ని వరాలను గుప్పిస్తూ ఉన్నాడు. ఇలాగ జగదేకమాత అయిన అలమేలు మంగమ్మ అనుగ్రహం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అడుగడుగునా అర్రులు చాస్తూ అనేక విధాలుగా పరితపించినాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner