Tulasi Plant: ఇంట్లో నాటిన తులసి మొక్క తరచూ ఎండిపోతోందా? దానికి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి-is tulsi plant drying up often find out what the legends say about it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Plant: ఇంట్లో నాటిన తులసి మొక్క తరచూ ఎండిపోతోందా? దానికి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Tulasi Plant: ఇంట్లో నాటిన తులసి మొక్క తరచూ ఎండిపోతోందా? దానికి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
May 17, 2024 01:32 PM IST

Tulasi Plant: ఒక్కోసారి ఇంట్లో నాటిన తులసి మొక్క కొన్ని రోజులకే ఎండిపోతుంది. ఎన్నిసార్లు తెచ్చి వేసినా అలా ఎండిపోతూ ఉంటే అందుకు కారణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

తులసి మొక్క
తులసి మొక్క

Tulasi Plant: మనదేశంలో ప్రతి హిందూ కుటుంబంలో పెరట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే. పెరడు లేని వారు బాల్కనీలో అయినా చిన్న కుండీలో తులసి మొక్కను పెంచుకుంటారు. ఇది మతపరమైన ఆచారం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇంట్లో ఆరోగ్యవంతంగా తులసి మొక్క ఎదుగుతూ ఉంటే ఆ పరిసరాలు శుద్ధి అవుతాయని, ప్రతికూల శక్తులు దూరమవుతాయని, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు దైవానుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. కానీ కొన్నిసార్లు కొన్ని ఇళ్లల్లో తులసి మొక్కలు తరుచూ ఎండిపోతూ ఉంటాయి. దీనికి పురాణాలు ఎలాంటి కారణాలు చెబుతున్నాయో తెలుసుకుందాం.

తులసి మొక్క ఎండిపోతే...

హిందూ విశ్వాసాల ప్రకారం తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. లక్ష్మీ దేవతతో ఈ మొక్క ముడిపడి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతమైన తులసి మొక్క ఎండిపోవడం మొదలైందంటే ఆ ఇంటి లోపల ప్రతికూల శక్తులు, చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మొక్క ఎదగకపోయినా ఆ ఇంట్లో ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయని అర్థం.

లక్ష్మీ దేవి కటాక్షం ఉండదు

తులసి మొక్క ఎండిపోతుందంటే అర్థం... ఆ ఇంట్లో నివసించే ప్రజల నిర్లక్ష్యాన్ని కూడా సూచిస్తుంది. అజ్ఞానం వల్ల మొక్కను సంరక్షించకపోవడం వల్లే తులసి అలా అవుతుందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క అలా ఎండిపోతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడదు.

ఒక ఇంట్లో తరచుగా తులసి మొక్క ఎండిపోవడం జరుగుతూ ఉంటే అది రాబోయే విపత్తును లేదా దురదృష్టాన్ని సూచిస్తుందని అంటారు. తులసి మొక్క కుటుంబానికి రక్షకునిగా, ఐశ్వర్యాన్ని అందించేదిగా పరిగణిస్తారు. కానీ తులసి మొక్క ఎండిపోతుందంటే త్వరలో విపత్తు రాబోతుందని సూచనగా భావించేవారూ ఉన్నారు. తులసి మొక్క ఎండిపోతున్నప్పుడు ప్రజలు భక్తి, భావనలతో ప్రార్థనలు చేసి, ఇంటిని శుభ్రపరిచి, తిరిగి కొత్త తులసి మొక్కను నాటి ప్రతిరోజు దీప ధూపాలతో పూజించాలి.

తులసి మొక్క ఇంటి చుట్టూ సానుకూల శక్తిని ప్రసరించేలా చేస్తుంది. ఆ మొక్క ఎండిపోవడం ప్రారంభించందంటే ఆ ఇంట్లో సానుకూలత తగ్గుతోందని అర్థం. ఒకరితో ఒకరికి సంబంధాలు ప్రేమలు తగ్గిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అధిక ఒత్తిడి అసమ్మతి రావచ్చు.

ముఖ్యంగా తులసి మొక్క ఎండిపోతుందంటే ఆ ఇంట్లో సంపద తగ్గిపోవచ్చని అర్థం. ఆ ఇంటి వారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచనగా భావించాలి. ఎందుకంటే హిందూ నమ్మకాల ప్రకారం తులసి లక్ష్మీదేవి అవతారం. ఎప్పుడైతే తులసి మొక్క ఎండిపోతుందో అవి ఆర్థిక కష్టాలను సూచిస్తాయని ఎంతోమంది హిందూ గురువుల నమ్మకం.

Whats_app_banner