Sai Dharam Tej in Tirumala: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయంతో మెగా ఫ్యామిలీ పట్టరాని సంతోషంలో ఉంది. ముఖ్యంగా పవన్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా అతడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల వెళ్లిన అతడు.. శనివారం (జూన్ 15) ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నాడు.
శుక్రవారం (జూన్ 14) సాయంత్రమే తిరుపతి చేరుకున్న సాయి ధరమ్ తేజ్.. అక్కడ అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్నాడు. ఏపీ ఎన్నికల్లో తన మామ పవన్ కల్యాణ్ గెలిస్తే కాలి నడకన వస్తానన్న మొక్కులో భాగంగా అతడు మెట్ల మార్గంలో ఏడు కొండల వాడి దగ్గరికి వెళ్లాడు. పవన్ ఎమ్మెల్యేగానే కాదు డిప్యూటీ సీఎం కూడా కావడంతో సాయి ధరమ్ తన మొక్కు చెల్లించాడు.
అతడు కాలి నడకన వెళ్తున్న సమయంలో చాలా మెగాభిమానులు చుట్టూ చేరి అతనితోపాటు పై వరకు వెళ్లారు. కొండపైకి చేరుకున్న తర్వాత కూడా అక్కడి అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. శనివారం (జూన్ 15) ఉదయమే వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నాడు. గతేడాది పవన్ తో కలిసి అతడు బ్రో మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఎలాంటి సినిమాలు చేయడం లేదు.
పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు పలకడం, దీనిపై పరాయివాడంటూ పరోక్షంగా నాగబాబు ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఇక ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడగానే సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు.
నిజానికి పవన్ గెలవగానే అతని దగ్గరికి వెళ్లి భుజాలపైకి ఎత్తి అతని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో అందరి కంటే ఎక్కువగా పవన్ విజయాన్ని అతడే ఆస్వాదిస్తున్నట్లు ప్రతి సందర్భంలోనూ స్పష్టమవుతోంది. ఇప్పుడు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని తన మొక్కు కూడా తీర్చుకున్నాడు. శనివారం తిరుమలలో సాయి ధరమ్ తేజ్ తోపాటు నటుడు సుమన్, మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ లాంటి సెలబ్రిటీలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కూడా పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఓజీ, హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు అతని చేతిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలను పూర్తి చేసి అతడు పూర్తిగా పాలనపై దృష్టి సారిస్తాడా లేక తర్వాత కూడా సినిమాలను అంగీకరిస్తాడా అన్నది తేలాల్సి ఉంది.