Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి-guntur young man knife attack on woman not accepting love proposal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి

HT Telugu Desk HT Telugu

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

గుంటూరు జిల్లాలో దారుణం, యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి (Pixabay)

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడికి పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తాడేపల్లి జాతీయ రహదారి ఎయిమ్స్ రోడ్డు వద్ద ప్రేమోన్మాది యువతిని బ్లేడ్ తో గొంతు కోసేందుకు ప్రయత్నించి దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కావ్య అనే యువతి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మూడేళ్లుగా నర్స్ గా పని చేస్తోంది. మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్తోంది‌. అయితే ఆదివారం కావడంతో ఆ యువతి చర్చికి వెళ్లి అక్కడ ప్రార్థనలు ముగిసిన తరువాత హాస్టల్‌కు చేరుకుంది.

ఈ సమయంలో ఆ యువతితో హాస్టల్ వద్ద మాట్లాడేందుకు బందరు సమీపంలో క్రోసూరుకు చెందిన కాంత్రి మౌళి ప్రయత్నించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని కోరాడు. దానికి ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో కాంత్రి మౌళి, తన వద్ద ఉన్న బ్లేడ్ ను తీసి యువతి మెడపై దాడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి, ఆ యువకుడిని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించింది. ‌ఈ క్రమంలో ఆ యువతి చేతికి గాయాలు అయ్యాయి. అలాగే గొంతుపై కూడా గాయాలు కాగా యువతి అప్రమత్తం కావటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ యువతి కేకలు వేసింది.‌ దీంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.‌

ఆ యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అడ్డుపడి నిందితులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. బాధితురాలని స్థానిక మణిపాల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.‌ స్థానికులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం