Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ-guntur woman cheated one crore 27 lakh high profit in online trading police case filed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ

HT Telugu Desk HT Telugu
Oct 06, 2024 06:22 PM IST

Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ ఓ మహిళను మోసం చేశాడో సైబర్ కేటుగాడు. మహిళను నమ్మించి ఏకంగా రూ.1.27 కోట్లు కొట్టేశాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫేస్ బుక్ లో వచ్చిన ఓ లింక్ ను క్లిక్ చేయడంతో ఇదంతా జరిగిందని బాధితులు అంటున్నారు.

ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ
ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మాయమాటలు, రూ.1.27 కోట్లకు కుచ్చుటోపీ

గుంటూరు జిల్లాలో ఒక మ‌హిళ‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటూ మాయ మాట‌లు చెప్పి, ఏకంగా రూ.1.27 కోట్లకు ఒక వ్యక్తి కుచ్చుటోపి పెట్టాడు. గుంటూరు న‌గ‌రంలోని న‌లందా న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణిని ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతా పేరుతో రూ.1.27 కోట్లు మోసం చేశారు. దీంతో ఆమె సెప్టెంబ‌ర్ 25న గుంటూరు న‌గ‌రంలోని ప‌ట్టాభిపురం పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. న‌లందా న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఓ ఉన్నత విద్యాభ్యాసం చేసిన గృహిణి ఇటీవ‌లి రోజువారీ ప‌నులు పూర్తి చేసుకుని సెల్‌ఫోన్ చూస్తున్నారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఫేస్‌బుక్ యాప్‌లో ఎంఓయూఎన్‌టీఓ.క‌మ్ అని ఒక మెసేజ్ వ‌చ్చింది.

ఆ మెసేజ్‌ను క్లిక్ చేయ‌గానే ట్రేడింగ్ ఖాతా మేనేజ‌ర్ పేరుతో ప్రత్యక్షమైన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ కోసం పెట్టుబ‌డులు పెట్టడం ద్వారా లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చని చెప్పారు. దీంతో ఆ గృహిణి ట్రేడింగ్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో కొంత పెట్టుబ‌డి పెట్టారు. దానికి కొంత లాభం వ‌చ్చిన‌ట్లు చూపించారు. అలా విడత‌ల వారీగా పెట్టుబ‌డి పెట్టించి దానికి లాభం ఇస్తుండ‌టంతో న‌మ్మకం పెరిగింది. ఆ ర‌కంగా న‌మ్మకాన్ని పొందాడు స‌దరు వ్యక్తి.

ఇలా ఆ మేనేజ‌ర్ ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా రూ.1.27 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నాడు. త‌రువాత న‌గ‌దు వెన‌క్కి రాలేదు. అస‌లు ఆ యాప్ కూడా ప‌ని చేయ‌డం లేదు. మోస‌పోయామ‌ని ఆమె గుర్తించి గ‌త నెల 25న పోలీసుల‌ను ఆశ్రయించారు. ప‌ట్టాభిపురం పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్ ట్రేడింగ్, షేర్ల వ్యాపారం పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు రూ.41 ల‌క్షల‌కు టోక‌రా

ఆన్‌లైన్ ట్రేడింగ్‌, షేర్ల వ్యాపారంలో పెట్టుబ‌డుల పేరుతో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఆన్‌లైన్ మోస‌గాళ్లు రూ.41 ల‌క్షలకు టోక‌రా పెట్టారు. ఎన్‌టీఆర్ జిల్లా పెన‌మ‌లూరులోని కానూరులో ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కె.ల‌లితారాణి నివ‌సిస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్‌కు గ‌త ఆగ‌స్టులో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ కంపెనీ నుంచి వాట్సాప్‌లో ఓ స‌మాచారం వ‌చ్చింది.

దాని నిర్వాహ‌కుడు సునీల్ అగ‌ర్వాల్ ఆమెను సంప్రదించి త‌మ సంస్థలో పెట్టుబ‌డి పెడితే అధిక లాభాలొస్తాయ‌ని న‌మ్మ బ‌లికాడు. దీంతో ఆమె విడ‌త‌ల వారీగా రూ.41 ల‌క్షలు పెట్టుబ‌డి పెట్టారు. ఆ మొత్తాన్ని తిరిగి విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయ‌త్నించ‌గా ఫ‌లించ‌లేదు. దీనిపై సునీల్ అగ‌ర్వాల్‌ను సంప్రదించ‌గా బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడాడు. మోస‌పోయిన‌ట్లు గుర్తించి ఆమె శ‌నివారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ముంబయి క్రైం బ్రాంచ్‌ ఉద్యోగిన‌ని న‌మ్మించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వ‌ద్దే రూ.1.3 కోట్లు స్వాహా

సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాల‌కు చ‌దువు కున్నవారు, చ‌దువు లేని వాడు అనే తేడా లేకుండా బ‌ల‌వుతున్నారు. తాజాగా గుంటూరులో సైబ‌ర్ నేరగాడి మాయ‌మాట‌ల‌కు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగే మోస‌పోయాడు. ముంబయి క్రైం బ్రాంచ్‌ ఉద్యోగిన‌ని నమ్మించి ఒక వ్యక్తి ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వ‌ద్దే రూ.1.3 కోట్లను స్వాహా చేశాడు. ఈ ఘ‌ట‌న గుంటూరు న‌గ‌రంలోనే చోటు చేసుకుంది. గుంటూరు న‌గరంలోని ప‌ట్టాభిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నివ‌సించే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగికి గ‌త నెల ఆరో తేదీన ఒక తెలియ‌ని నెంబ‌ర్ నుంచి ఫోన్ వ‌చ్చింది.

ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు చెప్పి, జీఎస్టీ శాఖ విధులు నిర్వర్తిస్తున్నాన‌ని తెలిపాడు. తాను ముంబయి క్రైం బ్రాంచ్ డివిజ‌న్ నుంచి వినోద్ ఖ‌న్నా అని పేర్కొన్నాడు. అడ్రస్‌తో స‌హా అన్ని చెప్పేశాడు. మ‌నీలాండ‌రింగ్‌కు పాల్పడిన‌ట్లు ఆరోపించాడు. బ్యాంక్ ఖాతాలో ప్రస్తుతం ఉన్న న‌గ‌దు వివ‌రాలు కూడా పూస‌గుచ్చిన‌ట్లు పేర్కొన్నాడు. అయితే అప్పటికీ బాధితుడు న‌మ్మక‌పోవ‌డంతో ఆ సైబ‌ర్ నేర‌గాడు వీడియో కాల్ కూడా చేశాడు. అందులో సైబ‌ర్ క్రైం డివిజ‌న్ కార్యాల‌యం, ఆయ‌న వెనుక భాగంలో పోలీసు స్టిక్కరింగ్ ఉన్నాయి. దీంతో బాధితుడు భ‌యాందోళ‌ల‌కు గుర‌య్యాడు. భ‌య‌పెట్టి రూ.1.3 కోట్లు న‌గ‌దు బాధితుడి భార్య ఖాతా నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నాడు. ఆ త‌రువాత అత‌డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స‌మాధానం రాక‌పోవ‌డంతో మోస‌పోయిన‌ట్లు ఉద్యోగి గ్ర‌హించాడు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం