APSRTC Free Bus: ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్
APSRTC Free Bus: ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
APSRTC Free Bus: ఏపీలో టీడీపీ-జనసేన ఎన్నికల హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం ఆర్నెల్లుగా విజయవంతంగా నడుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ నిర్ణయంతో మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిందని కూడా వార్తలు వచ్చాయి.
ఏపీలో గత జూన్ 4న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో 164స్థానాలు లభించాయి. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా పథకాన్ని అమలు చేయడం లేదని విపక్షాలు ఆరోసిస్తున్నాయి ఈ క్రమంలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో గత ఏడాది ప్రారంభమైన ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళలకు చక్కగా ఉపయోగపడుతోంది. పేద, మధ్య తరగతి మహిళలు ఉపాధి కోసమే సంపాదనలో నిత్యం పెద్ద మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పనిచేసే ప్రాంతానికి వెళ్లడానికి ఆదాయంలో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం వారికి ఆదాయంలో కొంత మిగిలే వెసులుబాటు కల్పిస్తోంది. sa