Kanna joined in TDP: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
Kanna Lakshminarayana joined in TDP: బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ…టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Kanna Lakshminarayana Latest News: బీజేపీ ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం భారీ ర్యాలీతో టీడీపీ ఆఫీస్ కు చేరిన ఆయన.. చంద్రబాబు సమక్షంలో చేరారు. కండువా కప్పి కన్నాను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే తాను టీడీపీ గూటికి చేరానని... రాజధాని అమరావతి, భావి తరాల భవిష్యత్తు కోసం పార్టీ మారినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెస్తున్నారని కన్నా ఆరోపించారు. అమ్మి తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్.. అమరావతి రాజధానికి మద్దతు తెలిపి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ప్రజలకు భవిష్యత్ లేకుండా పోయిందన్నారు. ప్రజల సంక్షేమం గురించి అసలు ఆలోచన చేయడం లేదని విమర్శించారు.
కన్నా చేరిక సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... ఏపీ రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పద్ధతి, నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని భావించి కన్నా టీడీపీలోకి వచ్చారని చెప్పారు. కన్నాతో పాటు గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ మార్పునకు కారణం సోము వీర్రాజే అన్నారు. అయితే నిజానికి తొలుత కన్న జనసేనలోకి వెళ్తారని కూడా అందరూ భావించారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్... కన్నా ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. దీంతో పక్కాగా కన్నా.. పవన్ వెంట నడుస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా... టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలో బలమైన కాపు నాయకుడిగా కన్నాకు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పని చేశారు.
టీడీపీలో చేరికకు ముందే తాను పోటీ చేసే స్థానం విషయంలో చంద్రబాబు కన్నాతో చర్చించినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి లేదా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం