Kanna Joins In TDP : సైకిల్ ఎక్కుతున్న కన్నా లక్ష్మీనారాయణ-ex bjp president kanna lakshmi narayana will join in telugu desam party on february 23 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Bjp President Kanna Lakshmi Narayana Will Join In Telugu Desam Party On February 23

Kanna Joins In TDP : సైకిల్ ఎక్కుతున్న కన్నా లక్ష్మీనారాయణ

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 06:31 AM IST

Kanna Joins In TDP బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైకిల్ ఎక్కుతున్నారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కన్నా ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు తెరదించారు. కన్నా అభిమానులు, అనుచరులు టీడీపీ వైపే మొగ్గు చూపడంతో కన్నా తన నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లొద్దని పలువురు సన్నిహితులు సూచించడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ప్రయాణం
కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ప్రయాణం

Kanna Joins In TDP బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైకిల్‌ ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఈనెల 23న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరటానికి రంగం సిద్ధమైంది.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేక కన్నా ఆ పార్టీని గత వారం వీడారు. ఈ నెల 16న భాజపాకు రాజీనామా చేసిన ఆయన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించటానికి సన్నిహితులు, అభిమానులతో గుంటూరులోని తన నివాసంలో సమావేశమయ్యారు.

కన్నా నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. ''రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు, రాక్షస పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, అమరావతి రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరుతో అన్యాయం జరుగుతోందని కన్నా ఆరోపించారు.

రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయగల సమర్థత, రాజకీయ దక్షత ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని, ఆయన సారథ్యంలో కన్నా లాంటి సీనియర్లు పనిచేస్తే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. కన్నాతో పాటు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రయాణం చేస్తున్న తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, డీఆర్‌ సుబ్రహ్మణ్యం, సైదారావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరుదామని కన్నాపై ఒత్తిడి చేశారు.

రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాక్షేమం దృష్ట్యా తెదేపాలో చేరాలని వారి అభిప్రాయాల్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై ఏపీలో బీజేపీ పోరాటం చేయడం లేదని ఇంకొందరు నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లొద్దని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, తెదేపాలో చేరితేనే మంచిదని పలువురు నాయకులు కన్నాకు సూచించారు.

కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగానే….

''తొమ్మిదేళ్లుగా ఏ అధికార పదవుల్లో లేకపోయినా కష్టసుఖాల్లో పాలుపంచుకున్న అభిమానుల అభిప్రాయాలు, నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకుపోదామని కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. నందమూరి తారకరత్న చనిపోవటంతో మిగతా ఏ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడనని కన్నా చెప్పారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

సన్నిహితులు అంతా తెలుగుదేశం పార్టీలో చేరాలని కోరారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమరావతి ఉద్యమానికి మద్దతు పలికానని కన్నా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేశానన్నారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, కార్యకర్తలు కోరిన విధంగా తెదేపాలో చేరుతున్నాని తెలిపారు.

IPL_Entry_Point