Perni Nani On Pawan : పవన్... నీకు ఏపీకి ఏం సంబంధం..? కనీసం రేషన్ కార్డు ఉందా..?
Ex Minister Perni Nani News : జనసేన అధినేత పవన్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. "చంద్రబాబే కావాలి... మోదీ, అమిత్‌షా జాన్తా నై.. " అని చెప్పే ధైర్యం పవన్ కు ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో అసలు గ్లాసు గుర్తు ఉందా...? అంటూ సెటైర్లు విసిరారు.
Perni Nani Satires on Pawan: ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుందా..మోడీతో మాట్లాడే ఖలేజా కావాలి కదా..? అంటూ పవన్ పై సెటెర్లు విసిరారు మాజీ మంత్రి పేర్ని నాని. అసలు ఏపీతో పవన్‌కల్యాణ్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. అసలు ఆయనకు ఏపీలో ఆధార్ కార్డైనా ఉందా..? కనీసం ఏపీలో సినిమాలైనా తీస్తున్నారా? అని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని కల గన్నావా..? అంటూ ఎద్దేవా చేశారు.
"ఎన్డీఏలో ఉండి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎరికి మద్దతిచ్చావ్ పవన్..? బీజేపీతో సంప్రదించే అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పావా..? కేసీఆర్ కోసం, మున్నూరు కాపుల ఓట్లను చీల్చడం కోసమే పోటీ చేస్తున్నావ్. ఏపీలో కాపుల ఓట్లున్న చోటే వారాహి యాత్రలు చేపట్టావు. చంద్రబాబు, పవన్‌లే ఈ రాష్ట్రానికి పట్టిన మహమ్మారి. పవన్ సన్నాసిన్నర సన్నాసి..అన్నా అది పవన్ డిక్షనరీ ప్రకారం తిట్టు కాదు. పదేళ్ల నుంచి నువ్వు బీజేపీతో కలిసి ఉండి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు..? సర్కస్‌లు మానేసి షంషేర్ రాజకీయాలు చేయి పవన్" అంటూ హితవు పలికారు.
నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై స్పందించారు పేర్ని నాని." తల్లిని, భార్యను రోడ్డుమీద వదిలేసి ఎవరి కాళ్లు పట్టుకుందామని ఢిల్లీ వెళ్లావ్ లోకేష్ ..? ఇది కదా దిక్కుమాలిన మేనేజ్‌మెంట్, లాబీయింగ్ అంటే..! వీరప్పన్ కూడా ఒక్కసారే దొరికాడు..ఆ ఒక్క సారితోనే చరిత్ర అంతమైంది. దొరకనంత మాత్రాన దొంగ..దొంగ కాకుండా పోతాడా..? మీరు నీతిమంతులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీకి సిద్ధమా?: జైళ్లో చంద్రబాబును ఓదార్చి బయటకొస్తున్నట్లుగా సినిమా చూపించారు. ఈ భారతదేశంలోనే అత్యంత నీతివంతుడు, నిఖార్సయిన నారా చంద్రబాబును రాజకీయ కక్షతో వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ గారు జైళ్లో పెట్టించారని ముగ్గురు కలిసి ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని చూశారు. కోర్టులను, సీఐడీ వ్యవస్థను మేనేజ్ చేసి నీతివంతుడైన తన తండ్రిని జైళ్లోకి జగన్ తోశారు అంటున్నారు. ఆయన్ను ఒకటే ప్రశ్నిస్తున్నా...మీ లెక్కలో అతినీతివంతుడైన మీ నాన్న గారు జైల్లోకి వెళ్లిన 24 గంటల నుంచి మీరెక్కడున్నారు...? ఢిల్లీ నుంచి రోజుకి రెండు, రెండున్న కోట్లు తీసుకునే ప్లీడర్లు బెజవాడ బజార్లలో తిరుగుతున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబును విడిపించమని ఇక్కడ కేసులు వేస్తూ తిరుగుతున్నారు. వాళ్లంతా బెజవాడ బజార్లలో తిరుగుతుంటే మీ తల్లిని, శ్రీమతిని రాజమండ్రి జైలు బయట రోడ్డుమీద వదిలేసి ఈ పాతిక రోజులు ఢిల్లీలో ఏం చేద్దామని వెళ్లావు..? మీ నాన్న నేర్పిన విద్య ఉంది కదా...ఎవర్ని మేనేజ్ చేద్దామని వెళ్లావు..? మీ తండ్రి వద్ద నుంచి మేనేజ్ చేయడం మీకు బ్రహ్మ విద్యే కదా? అంటూ లోకేశ్ ను టార్గెట్ చేశారు పేర్ని నాని.
ఆటవిడుపు యాత్ర….
"జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఐదు రోజులు కృష్ణా జిల్లాలో ఆటవిడుపు యాత్ర చేశారు. ఆయన మాటలన్నీ చివరికి జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు..కిక్కు ఇవ్వడం లేదు. జగన్ గారికి దమ్ముంటే బీజేపీతో పోరాటం చేయాలి అంటాడు. జగన్ గారికి దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజలను, దేవుడ్ని నమ్ముకున్న నిఖార్సయిన రాజకీయ నాయకుడు. పవన్ కల్యాణ్ లా .. చంద్రబాబు కోసం పూటకోమాట...రోజుకో వేషం..రోజుకో పార్టీ మార్చే తోతాపూరి రాజకీయ నాయకుడు కాదు. మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అని చెప్తున్నాడు. వైఎస్సార్‌నే ఎదిరించాను..నువ్వెంత జగన్ అంటున్నాడు.. మీ అన్నయ్య పార్టీ పెట్టింది 2008లో పెట్టారు. అప్పుడు మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్లున్నారు. నువ్వు రాజశేఖరరెడ్డి గారిపై పోరాటం చేశావని కనీసం మీ అన్నయ్యకైనా తెలుసా? నువ్వేం పోరాటం చేశావు..ఎక్కడ చేశావు అంటే కనిపించదు..సొల్లు కబుర్లు మాత్రమే కనిపిస్తాయి. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా..నీ ఇష్టం వచ్చినట్లు రాసుకోడానికి..? రేపు వాళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీని కొల్లేరులో నడిపిస్తాడట... అంటే కొల్లేరంతా ఎండిపోతుందని, వర్షాలు లేక ఎడారి అవుతుందని ముందే చెప్తున్నావా? 2014–19 వరకూ చంద్రబాబు, నువ్వు కలిసి పెద్దింట్లమ్మ గుడికి, కొల్లేరుకు ఏం పొడిచారు..? నీ మాటలో నిజాయితీ ఉందా పవన్ కల్యాణ్..? ఏపీకి రావాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలా అంటున్న నీకు అసలు ఏపీతో నీకేంటి సంబంధం..? ఏపీలో నీకు ఆధార్ కార్డుందా..? ఏపీలో నీకు ఇళ్లుందా..కాపురం ఉందా? ఏపీలో నీ సినిమా షూటింగులున్నాయా..? నువ్వు కూడా ఈ రాష్ట్రంలో ఉండవు. మళ్లీ పాస్ పోర్టులు కావాలా అంటాడు. ఈ నాలుగేళ్లలో నువ్వు ఎన్నిసార్లు వచ్చావు..ఎన్ని సార్లు పాస్‌పోర్టులు తీసుకున్నావు..?అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు.
“అసలు ఏపీలో నీకు గ్లాసు గుర్తు ఉందా పవన్ కల్యాణ్..? గుక్కెడు నీళ్లు తాగాలంటే గ్లాసు కావాలి...ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్లాలంటే సైకిల్ కావాలట. సైకిల్ సంగతి పక్కన పెట్టు...ఆంధ్రప్రదేశ్‌లో నీకు గ్లాస్ గుర్తు ఉందా..? గ్లాసే లేదు కదా...ఇంకేంటి తాగేది..సొల్లు మాటలు మాట్లాడొద్దు. ప్రజల్ని మోసం చేయవద్దు. బీజేపీ అంతా జీ20లో మునిగిపోయి...ఈయన ఫోన్ చేసినా ఎత్తడం లేదట. ఇక్కడేమో చంద్రబాబును వ్యానులో ఎక్కించుకుని జైలుకు తీసుకెళ్లిపోతున్నాడట. మోడీ, అమిత్‌షా, నడ్డాకి ఫోన్ కొట్టినా జీ20 అని ఫోన్ పెట్టేశారట. అప్పుడు ఏమీ చేయలేక గబగబా వెళ్లి పొత్తు ప్రకటించాడట. మా చిన్నప్పుడు దసరాకి దొరలు..వాళ్లు ఇలాంటి కబుర్లు చెప్తారు. నాకు చంద్రబాబే కావాలి...మోడీ, అమిత్‌షా జాన్తా నై అని చెప్పు. నువ్వు ఎన్డీఏలో ఉంటే మాకేంటి..లేకుంటే మాకేంటి..? నువ్వు చంద్రబాబుకి తొత్తుగా ఉంటున్నావు..అది చెప్తే కోపం వస్తుంది” అంటూ మాట్లాడారు పేర్ని నాని.