Amaravati Destruction: ఐదేళ్లలో అంతులేని నష్టం… అమరావతిలో వేల కోట్ల నిరుపయోగం
Amaravati Destruction: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ఐదేళ్లలో అంతులేని నష్టం జరిగింది. వేల కోట్ల రుపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. 40వేలమంది కార్మికులతో రేయింబవళ్లు సాగిన పనులకు 2019 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.
Amaravati Destruction: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనతో నిర్మాణాన్ని ప్రారంభించిన అమరావతి నగరంలో గత ఐదేళ్లలో తీవ్రంగా నష్ట పోయింది. 2014 డిసెంబర్‌లో రాజధాని ప్రాంతంగా కృష్ణా తీరంలో ఉన్న గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత ఏడాది వ్యవధిలోనే భూ సమీకరణ పూర్తి చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. 2016 ఆగష్టు నాటికి ఏకంగా రాజధాని కార్యకలాపాల కోసం సచివాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2019 వరకు శరవేగంగా సాగిన నిర్మాణ పనులకు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో ఒక్కసారిగా నిలిచిపోయాయి.
చంద్రబాబు నాయుడు పదవీకాలం 2019లో ముగియడానికి ముందు, అమరావతిలో మొదటి దశ నిర్మాణానికి రూ. 51,687 కోట్లు ఖర్చవుతుందని CRDA అంచనా వేసింది. మాస్టర్ ప్లాన్‌లో దాదాపు రూ. రూ. 39,875 కోట్ల పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.
మొత్తం మాస్టర్ ప్లాన్ పనుల్లో 15 శాతానికి సంబంధించిన 7,599 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 320 కిలోమీటర్ల మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లను నిర్మించాలని కోరారు. మొత్తం 285 కిలోమీటర్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
రేయింబవళ్లు నిర్మాణ పనులు…
అమరావతిలో పనులు చురుగ్గా సాగిన సమయంలో నిర్మాణ పనుల కోసం ఏకంగా 45వేల మంది కార్మికులు పనిచేసేవారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగేవి. శరవేవంగా పనుల్ని పూర్తి చేయడానికి ఆధునిక టెక్నాలజీ వినియోగించారు. సాధారణ గోడలతో నిర్మాణాలు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో షీర్ వాల్ టెక్నాలజీతో భారీ భవనాల నిర్మాణం చేపట్టారు.
రాజధాని నిర్మాణంతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, సచివాలయం, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాసాలు, హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జిల నివాసాలు ఇలా అడ్మినిస్ట్రేటవ్ సిటీలో దాదాపు ఐదారు కిలోమీటర్ల పొడవున భారీ నిర్మాణాలను చేపట్టారు. 2019లో ప్రభుత్వం మారిపోయే సమయానికి వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి. అధికారుల క్వార్టర్లు చివరి దశకు చేరాయి. ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు బస చేయడానికి వీలుగా రూపొందాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నగరంలో నిర్మాణ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అమరావతి నిర్మాణం లేదని తేల్చేయడంతో పనులు ఆగిపోయాయి. 2019 డిసెంబర్‌లో శాసన సభలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తామని జగన్ ప్రకటించారు. దీంతో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాలుగున్నరేళ్లుగా అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి.
కోర్టు కేసులు, చట్ట సవరణలు, వివాదాలు, విమర్శలు ఎన్ని వచ్చినా రాజధాని తరలింపుపై వైసీపీ అధ్యక్షుడు వెనక్కి తగ్గలేదు. అమరావతి నిర్మాణ భారం సాధ్యం కాదని రాజధాని తరలింపుకు మొగ్గు చూపారు.
నిలిచిపోయిన చెల్లింపులు…
ప్రభుత్వం మారేసమయానికి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.9వేల కోట్ల రుపాయల్ని చెల్లించాల్సి ఉంది. వాటిని నిలుపుదల చేయడంతో కాంట్రాక్టర్లు అల్లాడి పోయారు. చేసిన పనులకు డబ్బులు అందకపోవడంతో కోర్టుల్ని ఆశ్రయించారు. అయినా అమరావతికి నిధుల విడుదలకు ప్రభుత్వం చేయలేదు.
రాజధానిలో మెజారిటీ ప్రాంతం కవర్ అయ్యే విధంగా మౌలిక వసతుల కల్పనతో పాటు మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలి దశలో పనులను చేపట్టారు. మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణం కూడా దాదాపు 90 శాతం పూర్తి చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో భాగంగా 2015 జనవరి 1 న ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 వ తేదీ అర్థరాత్రికల్లా లిటిగేషన్ లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారు. గత ఐదేళ్లలో అమరావతి ప్రాంతం మొత్తం చిట్టడవిలా మారిపోయింది. నిర్మాణ పనుల పునాదుల్లో నీళ్లు చేరి చెరువుల్లా మారిపోయాయి.
అమరావతి విశేషాలు…
- మొత్తం రాజధాని నగరం వైశాల్యం: 217.23 చ.కి.మీ
- సీడ్ క్యాపిటల్ 16.94 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
- రాజధాని నగరం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో విస్తరించి ఉంది
- 2050 నాటికి 3.55 మిలియన్ల జనాభా ఉంటుందని అంచనా
- రూ.33,000 కోట్ల అంచనా వ్యయంతో 7-8 సంవత్సరాలలో దశలవారీగా కొత్త రాజధాని నగరం యొక్క మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.
- 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో అమరావతి నగరానికి శంకుస్థాపన చేశారు.
- అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ప్రకారం, 10వ సంవత్సరం నాటికి నగరంలో 105,000–190,000 ప్రత్యక్ష ఉద్యోగాలతో సహా 300,000–550,000 ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- అమరావతిలో ప్రతి కార్మికుడు సగటున 1.6 అదనపు కుటుంబ సభ్యులను తీసుకురావచ్చని అంచనా వేశారు.
- 2025నాటికి అమరావతి జనాభా 350,000–600,000లకు చేరుతుందని అంచనా వేశారు.
- అమరావతిని ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి, తొమ్మిది ఆర్థిక నేపథ్య నగరాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.
- ఫైనాన్షియల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ మరియు టూరిజం సిటీలను ఏర్పాటు చేయాలని భావించారు.
- అమృత విశ్వవిద్యాలయం, అమిటీ మరియు ఇండో-UK ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (IUIH), లండన్‌లోని కింగ్స్ కాలేజ్ సహకారంతో, ప్రతిపాదిత ఎడ్యుకేషన్ సిటీలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి.
- ప్రభుత్వ నగరంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, న్యాయశాఖ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస గృహాల పనులు దాదాపు పూర్తయ్యాయి.
- సచివాలయం, సీఎంఓ, మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ నగరంలో భాగమైన అసెంబ్లీ భవనాలు, హైకోర్టు, న్యాయ నగరంలో భాగమైన ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్‌లతో కూడిన ప్రభుత్వ సముదాయాల పనులను ప్రారంభించారు.
- పర్యాటక రంగంలో, క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం ఆసక్తి వ్యక్తీకరణ లేఖలను జారీ చేశారు.
- అంతర్జాతీయ మెరీనాలు, థీమ్ పార్కులు, హాస్పిటాలిటీ మరియు MICE కేంద్రాల ఏర్పాటు మరియు రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి ఇతర వినోద కార్యకలాపాల సృష్టికి సంబంధించిన పనులు ఇప్పటికీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) దశలోనే ఉన్నాయి.
- వివిధ సంస్థలకు భూకేటాయింపుల ద్వారా 60,000 ఉద్యోగాలు, స్థానిక జనాభా ప్రోత్సాహంతో స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు.
- ల్యాండ్ పూలింగ్ పథకం కింద, భూ యజమానులకు CRDAకి పూల్ చేయబడిన భూమిలో 25-30 శాతం పట్టణ పరిసరాల్లో అన్ని యుటిలిటీలతో పూర్తిగా అభివృద్ధి చెందిన ప్లాట్‌గా అందించారు.
- 22 రెవెన్యూ గ్రామాలు, 65,235 రిటర్నబుల్ ప్లాట్‌లలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. వీటిలో 37,531 నివాస, 26,038 వాణిజ్య, 1666 విల్లాలను వారి భూ యజమానులకు కేటాయించారు.
- సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ (SAIH) అనేది అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ ఆంధ్రా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ మరియు సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్ ఇండియా యొక్క పూర్తి యాజమాన్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీగా ఉంది.
- స్టార్టప్ ఏరియా మొత్తం 6.84 చ.కి.మీ అభివృద్ధి భూభాగాన్ని కలిగి ఉంది, దీనిని 2015లో ప్రారంభించి వచ్చే 20 సంవత్సరాలలో మూడు దశల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది.
- జర్మనీ, భారతదేశం, జపాన్ మరియు సింగపూర్‌కు చెందిన 15 కంపెనీలు మరియు సంస్థలు స్మార్ట్ బిల్డింగ్‌లు, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్‌లు మరియు స్మార్ట్ సహకారాలలో భాగస్వాములుగా ADPతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.