Visakhapatnam Tragedy: విశాఖలో ఘోరం.. వీధి కుక్కల దాడిలో వృద్ధురాలి దుర్మరణం
Visakhapatnam Tragedy: విశాఖపట్నంలో వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘటనలో వృద్ధురాలు దుర్మరణం పాలైంది.
Visakhapatnam Tragedy: విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం వేకువ జామున విశాఖపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 87వ వార్డులోని అంబేడ్కర్ కాలనీలో శాంతమ్మ (70) అనే వృద్ధురాలు తన కోడలితో కలిసి నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి సమీపంలోని రోడ్డుపైకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి.
చేతులు, తొడ, కాళ్లు, ముఖం తదితర శరీర భాగాలను ఎడపెడ పీకేయడంతో ఎముకలు బయటకు వచ్చి.. వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదు. ఉదయాన్నే స్థానికులు శాంతమ్మ మృతదేహాన్ని గుర్తించి..ఆమె కోడలికి సమాచారం ఇచ్చారు.
కుక్కల దాడిలో చనిపోయిన శాంతమ్మ ఇద్దరు కొడుకులు, భర్త గతంలోనే మృతి చెందారు. కోడలు దేవి ఆటోనగర్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీధి కుక్కల సమస్యపై జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. వృద్ధురాలు ప్రాణాలు కోల్పోడానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.